13 రోజుల్లో 30 లక్షల టీకాలు! కోవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్ టాప్
posted on Jan 30, 2021 @ 10:54AM
కోవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్ దూసుకుపోతోంది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను పక్కాగా, వేగంగా నిర్వహిస్తూ రికార్డులు స్పష్టిస్తోంది. అమెరికా, బ్రిటన్ సహా చాలా దేశాలు మన కంటే ముందుగానే టీకాల పంపిణి ప్రారంభించాయి. అయితే వాటన్నింటి రికార్డులను బ్రేక్ చేస్తూ... ఇండియా సరికొత్త రికార్డు నెలకొల్పింది. కేవలం 13 రోజుల్లో... 30 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇచ్చిన దేశంగా రికార్డు సృష్టించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. 30 లక్షల వ్యాక్సినేషన్ మార్క్ చేరుకోవడానికి అమెరికాకు 18 రోజులు పట్టగా... ఇజ్రాయెల్‌కు 33 రోజులు పట్టింది. బ్రిటన్‌కు 36 రోజులు పట్టింది.
భారత్ లో వేగంగా వ్యాక్సినేషన్ జరగడానికి ప్రధాన కారణం ర్యాపిడ్ టెస్టింగ్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉండటమే. మన దేశంలో మొదటి నుంచి రకరకాల వ్యాధులకు టీకాలు వేసే అలవాటు ఉంది. గ్రామస్థాయి నుంచి పైస్థాయి వరకూ ఇలాంటి సదుపాయాలు బాగా ఉన్నాయి. ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేయడంలో ట్రైనింగ్ ఉంటుంది. అందుకే కరోనా వైరస్‌కి వ్యాక్సిన్లు రాగానే... అంతా రెడీ అయిపోయారు. వేగంగా టీకాలు వేసేస్తున్నారు. రోజూ సగటున 5 లక్షల మందికి టీకాలు వేస్తున్నారు. జనవరి 16న ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడు రోజుకు 2 లక్షలే వేయగలిగారు. ఇప్పటికే ఇండియా వేగంగా 10 లక్షల వ్యాక్సిన్లు, వేగంగా 20 లక్షల వ్యాక్సిన్ల రికార్డులను సొంతం చేసుకుంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను పక్కాగా, వేగంగా నిర్వహిస్తున్నాయి. అందుకే అన్ని రాష్ట్రాల్లోనూ ఇది సమర్థవంతంగా సాగుతోంది. జనవరి 29 వరకే 2 లక్షల 86 వేల 89 మందికి టీకా వేసి కర్ణాటక రాష్ట్రం దేశంలో ముందు ఉంది. , మహారాష్ట్ర (2,20,587), రాజస్థాన్ (2,57,833), ఉత్తరప్రదేశ్ (2,94,959) సహా కొన్ని రాష్ట్రాల్లో 2 లక్షల మందికి పైగా టీకా పొందారు. ఫిబ్రవరి నుంచి హెల్త్ వర్కర్లతోపాటూ... ఫ్రంట్ లైన్ వర్కర్లకు కూడా వ్యాక్సిన్ వేయబోతున్నారు. ఇందుకు అన్ని రాష్ట్రాలూ రెడీ అవుతున్నాయి. దీంతో దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ మరింత వేగం కానుంది.