అగాధంలో రూపాయి
posted on Aug 30, 2013 @ 10:08AM
నేడు భారత దేశం తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. దీనికి కారణాలు అనేకం. అన్నీ ప్రభుత్వ విధానాలతో కూడుకున్న కారణాలు. నేటి యు.పి.ఎ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్ధిక విధానాలే ప్రధాన కారణం. నేటి ప్రభుత్వానికి ఓట్ల మీదున్న శ్రద్ధ ప్రజా సంక్షేమం మీద లేదు. అందుకు ఉదాహరణగానే రోజుకొకటి పుట్టుకొస్తున్న ప్రజాకర్షక పధకాలు. నేటి రూపాయి పతనం డాలరుతో పోలిస్తే 68 రూపాయిలు దాటుతోంది. దీనితో భారత ఆర్ధిక పరిస్థితి 1990-91 నాటి పరిస్థితికి దిగజారిందా అన్నంత ఆందోళన కలిగిస్తుంది.
నేటి దేశ ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దటానికి అప్పటి ప్రధాని,ఆర్ధిక మంత్రి విదేశీ పెట్టుబడులను ఆకర్షించటానికి ఎన్నో ఆర్ధిక సంస్కరణలను ప్రవేశ పెట్టారు. వాటిలో భాగంగా పారిశ్రామిక సరళీకరణ,సబ్సిడీలను తగ్గించటం,ఎన్నో పొదుపు చర్యలను చేపట్టటం లాంటి విధానాలను అనుసరించి దేశం ఆర్ధిక ప్రగతి వైపు పయనిస్తుందనే నమ్మకం పెట్టుబడిదారులలో కలిగించి,దేశ ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దటం జరిగింది. కాని అప్పటి ఆర్ధిక మంత్రిగా పనిచేసిన నేటి ప్రధాని హయాంలో,మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో సరళీకృత ఆర్ధిక విధానాలను కొనసాగిస్తున్నప్పటికి అప్పటి భిన్నమైన పరిస్థితులను కలుగచేసి పెట్టుబదిదారులలో అపనమ్మకాన్ని కలిగించటంమే నేటి ఈ రూపాయి పతనానికి కారణమయ్యింది.
పెట్టుబడిదారీ వ్యవస్థలు వ్యతిరేకించే సబ్సిడీలని పెంచుతూ,సంక్షేమ పధకాలను మరింత పెంచుతూ పెట్టుబడులను వెనుకకు వెళ్ళే పరిస్థితిని సృష్టించారు. గ్యాస్ మీద సబ్సిడీ ఇంతకు ముందు నుండి ఇస్తున్నప్పటికీ దానిని నగదు బదిలీ పధకం కింద మార్చి అదొక కొత్త సంక్షేమ పదకంగా చూపించటం ఒక కారణం కాగా లక్ష కోట్లు దాటిన ఆహారభద్రత అనే మరొక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టటం ద్వారా ఈ యు.పి.ఎ ప్రభుత్వం సంక్షేమ రాజ్యంగా రాజ్యంగా మారుస్తున్నామనే సంకేతం పంపటం ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరిగి రూపాయి మరింత పతనం దిశగా పయనిచింది. ఇక పొదుపు చర్యలనేవి ఎక్కడా కానరావటం లేదు. ఓట్లు మరియు సీట్లు తప్ప దేశ ఆర్ధిక ప్రగతితో మాకు సంబంధం లేదు అనేటట్లు నేటి ప్రభుత్వం ప్రవర్తించటం పేద,ధనిక లేదా మధ్య తరగతి అనే భేదం లేకుండా ప్రజలంతా మూల్యం చేలిచుకోవలసి వస్తోంది.
నేడు సామాన్య ప్రజలతో పాటు MLA,MP లు మరియు కేంద్ర,రాష్ట్ర మంత్రులకు కూడా ఈ రూపాయి పతనం వలన కలిగే నష్టాలను గుర్తిస్తున్నట్లు లేరు. ఎగుమతులు,దిగుమతుల వ్యత్యాసం కూడా బాగా పెరిగిపోవటం కూడా నేటి ఈ దుస్థితికి కారణం. ఈ ఎగుమతులు దిగుమతులు డాలరు కరెన్సీలో జరుగుతున్నపుడు దిగుమతుల విలువ ఎంత ఉంటుందో ఎగుమతుల విలువ కూడా అంతే ఉండాలి. కానీ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉండటంతో డాలరుకు డిమాండ్ పెరిగి రూపాయి పతనం అవుతుంది. ఎగుమతులను పెంచటానికి దిగుమతులను తగ్గించటానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు నామ మాత్రంగా ఉన్నాయి.
ఈ రూపాయి పతనం వలన ప్రజల పై ఉండే ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం.
1. 70%పెట్రోల్ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవటం వలన పెట్రోల్,డీసెల్ ధరలు విపరీతంగా పెరిగి,దీని ద్వారా రవాణా చార్జీలు పెరిగి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి సామాన్యులకు బ్రతుకు భారంగా మారుతుంది.
2. దిగుమతి చేసుకుంటున్న బొగ్గు , డీసెల్ లాంటివి విద్యుత్త్ ఉత్పత్తికి ఉపయోగించటం వలన విద్యుత్త్ చార్జీలు విపరీతంగా పెరిగి ప్రజల పై మరింత భారం పడుతుంది.
3. రైలు,బస్సు,ఆటో లాంటి చార్జీలు కూడా పెరిగి ప్రజల పై ప్రయాణ చార్జీల భారం కూడా పడుతుంది.
4. నేటి నిత్యావసర వస్తువులలో చాలావాటిని దిగుమతి చేసుకోవటం వలన దాదాపుగా అన్నిటి ధరలు అంటే సబ్బులు,సర్ఫ్ లు,సెంట్లు,పేస్ట్ లు,సెల్ ఫోన్లు,పళ్ళు,కూరగాయలు ,ఉల్లి ,వెల్లుల్లి,కళ్ళజోళ్ళు,కాలిజోళ్ళు,తలకు రాసుకునే నూనెలు,పౌడర్లు,ఒక్కటేమిటి అన్నిటిని దిగుమతి చేసుకోవటానికి మనం అలవాటుపడ్డాము,తదనుగుణంగానే వాటన్నిటి ధరలు పెరిగి,భారం కానున్నాయి.
5. నేడు టి.వి,సెల్ ఫోన్ కార్ లాంటివి ప్రజలకు విలాసంగా కాక నిత్యావసరంగ మారటం గమనించ దగ్గ విషయం. వీటిలో వాడే విడి భాగాలనో లేదా మొత్తంగానో దిగుమతి చేసుకోవటం వలన వాటి ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
6. నేడు ప్రపంచమంత ఒక గ్లోబల్ విలేజ్గా మారుతున్న తరుణంలో చాలామంది విదేశీ ప్రయాణాలు చేస్తున్నారు. ఈ డాలరు విలువ పెరగటంతో విదేశీ ప్రయాణం మరింత భారం కానుంది.
7. విదేశాలలో చదువుకోవాలనుకునే వారికి ఆ చదువుల ఫీజులు మోయలేనంత భారం కానున్నాయి.
8. ఈ భారం ఔషధ పరిశ్రమల మీద పడి మందుల ధరలు అధికమవటం కారణంగా వైద్య సేవలు ఇహ ముందు అందుబాటులో లేనివిధంగా ఖరీదు కానున్నాయి.
9. ఎరువులు,విత్తనాలు దిగుమతి చేసుకోవటం ద్వారా వ్యవసాయ ఉత్పత్తులైన ఆహార ధాన్యాలు,పొగాకు,పత్తి,మొదలైనవన్నీ ప్రియం కానున్నాయి.
నేడు అధికార పక్షం కాని,ప్రతిపక్షం కాని వోట్ బ్యాంకు రాజకీయాలను వదిలి దేశ ఆర్ధిక ప్రగతి గురించి,దేశ భద్రత గురించి ఆలోచించ వలసిన సమయం ఆసన్న మయింది. అలా కాకుంటే మనదేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తుంది. సమర్దవంత మైన పరిపాలన ద్వారా వోట్లు పెంచుకోవాలని చూడాలే కానీ,ప్రజాకర్షక పధకాల ద్వారానో,విభజనల ద్వారానో వోట్లు పెంచుకోవాలని చూడడం నీచ రాజకీయానికి పరాకాష్ట.
- సాయి లక్ష్మి