ర్యాంకుల పంటలు… ప్రతిభకి తెగులు!
posted on Jun 9, 2017 9:28AM
ఏ దేశం ఎంత కార్పోరేట్ పరమైనా, క్యాపిటలిజమ్ పడగ విప్పినా… రెండు రంగాలు మాత్రం ప్రైవేటీకరణ కావద్దని చెబుతారు మేదావులు. అది నిజం కూడా! ఆ రెండు రంగాలే… విద్యా, వైద్యం! కానీ, మన దేశంలో నెహ్రు కాలంలో సోషలిజమ్ వున్నా, ఇప్పుడు క్యాపిటలిజమ్ వున్నా.. ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురవుతూ వున్నవి కూడా అవ్వి రెండే! భారతదేశంలో విద్యా, వైద్య రంగాలు దారుణంగా వుండిపోతున్నాయన్నది దాదాపుగా అందరూ అంగీకరించే సత్యమే!
స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అవుతన్నా మన విద్యా రంగం ఇంకా ప్రపంచ స్థాయికి ఎదగకపోవటం ఆందోళన కలిగిస్తుంటే… మరో వైపు రానురాను విద్యొక వ్యాపారమైపోతుండటం మరింత విషాదంగా మారిపోతోంది! ఏ చిన్న పరీక్షా ఫలితం వచ్చినా టీవీల్లో ర్యాంకుల హోరు మార్మోగిపోతుంటుంది. ఇక ఆ రోజంతా వివిధ ప్రైవేట్ విద్యా సంస్థల భీకరమైన యాడ్స్ కర్ణభేరుల్ని పగలగొట్టేస్తుంటాయి. ఒక్కో సంస్థ వందల ర్యాంకులు తమకే వచ్చినట్టు ప్రకటించుకుంటూ వుంటాయి. ఈ ప్రైవేట్ కాలేజీలు, కోచింగ్ సెంటర్ల వల్ల లాభమే లేదని చెప్పలేం. చాలా మంది పిల్లలు అక్కడి క్రమశిక్షణ వల్ల నాలుగు మార్కులు ఎక్కువ తెచ్చుకుని పాస్ అవుతున్నారు. కాని, అదే సమయంలో కార్పోరేట్ కాలేజీలు, కోచింగ్ సెంటర్ల దెబ్బకి ఒత్తిడితో తల్లడిల్లుతున్న లెక్కలేనంత మంది విద్యార్థులు కూడా వున్నారు! వారంతా పరిపక్వత లేని జ్ఞానంతో కేవలం గుమాస్తులుగా తయారవుతున్నారు. లేదా ఏ మాత్రం తెలివి వున్నా తరువాత విదేశాలకు వెళుతున్నారు!
ఇంజనీరింగ్, మెడిసిన్ లాంటి రంగాల్లో పోటీ పరీక్షల పరిస్థితి మనకు తెలిసిందే. ఇప్పటికీ కాస్త ప్రతిభకి విలువ దొరుకుతోంది సివిల్స్ లోనే! తాజాగా వెలువడ్డ సివిల్స్ ఫలితాల్లో కూడా చాలా మంది టాపర్లు ఏ కోచింగ్ సెంటర్ సాయం లేకుండా ఉత్తీర్ణత పొందారు. వారి సక్సెస్ స్టోరీలు మీడియాలో ప్రచారం కూడా అవుతున్నాయి. అయితే, భవిష్యత్ లో ఐఏఎస్ లో, ఐపీఎస్ లు అవ్వబోయే సివిల్స్ టాపర్స్ తో కూడా కొన్ని కోచింగ్ సెంటర్లు ఆటలాడుకుంటున్నాయి. వారు కష్టపడి స్వంతంగా సాధన చేసి టాపర్స్ గా నిలిస్తే ప్రైవేట్ శిక్షణ సంస్థలు తమ ఖాతాలో వేసుకుంటున్నాయి. అదీ ఎలాంటి పర్మిషన్లు గట్రా లేకుండానే!
సివిల్స్ మూడో ర్యాంక్ సాధించిన తెలుగు విద్యార్థి రోణంకి గోపాలకృష్ణ. ఆయన తమ విద్యార్థి అంటూ హైద్రాబాద్లోని కొన్ని కోచింగ్ సెంటర్లు ప్రచారం చేసుకున్నాయట! తాను అలాంటి కోచింగ్ లు ఏవీ తీసుకోలేదని స్వయంగా గోపాలకృష్ణ చెప్పారు. అసలు సివిల్స్ అటెంప్ట్ చేసేవారూ ఎవరూ కూడా కోచింగ్ లు తీసుకోకపోవటమే బెటర్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. అసలు ఒక ర్యాంక్ సాధించిన టాపర్ అనుమతి లేకుండా అతడి ఫోటోను, పేరును వాడుకోవటం అనైతికం. అందులోనూ ఆ విద్యార్థి అసలు సదరు కోచింగ్ సెంటర్ వద్దకొచ్చి ఏనాడూ శిక్షణ తీసుకోకపోతే , అప్పుడు కూడా బరితెగించి అతడి విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవటం నేరం కూడా!
భారతదేశం అత్యంత వేగంగా ఎదుగుతోంది. ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది యువత వున్నది కూడా మన దేశంలోనే. అందుకే, ఇప్పటికిప్పుడు ప్రభుత్వాలు విద్యా వ్యాపారాన్ని అరికట్టాలి. అప్పుడే దేశం భవిష్యత్ భద్రంగా వుంటుంది. లేదంటే, మన అభివృద్ధి బుడగ ఏదో ఒక రోజు అమాంతం పేలిపోతుంది!