పాక్ అప్పుడే దారులు సిద్దం చేసుకొంటోందా?
posted on Jan 4, 2016 @ 9:09PM
పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి జరిగిన తరువాత సహజంగానే అందరి వేళ్లు పాక్ వైపే చూపిస్తున్నాయి. ఈ సంఘటనను పాకిస్తాన్ కూడా ఖండించి సానుభూతి తెలిపింది. అంతటితో ఇక చేయవలసింది ఏమీ లేదన్నట్లుగా మౌనం వహించింది. ఇదివరకులాగ భారత్ తమని నిందించడంలేదనే సంగతి పాక్ గ్రహించే ఉంటుంది. కనుక ఈ వేడి చల్లార్చేందుకు పాక్ కూడా తన వంతుగా మరికొంత కృషి చేసి ఉంటే బాగుండేది. కానీ పాక్ తనకు బాగా అలవాటయిన ఎత్తులు వేయడం ఆరంభించింది.
ఈ దాడికి పాల్పడింది పాక్ లో శిక్షణ పొందిన జైష్ ఏ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ సభ్యులేనని భారత్ దృడంగా నమ్ముతోంది. కనుక ఒకవేళ భారత్ వేలెత్తి చూపినట్లయితే ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలబడకుండా తప్పించుకోవడానికి ముందస్తు ఏర్పాట్లు చేసుకొంటున్నట్లుగా కనిపిస్తోంది. బహుశః ఆ ప్రయత్నంలో భాగంగానే ఎవరూ ఊహించని విధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కి చెందిన యునైటెడ్ జిహాద్ కౌన్సిల్ అనే సంస్థ ఈ దాడికి పాల్పడింది తామేనని ఈరోజు ప్రకటించుకొంది. కానీ ఈ విషయం ప్రకటించడానికి అది మూడు రోజుల సమయం తీసుకొంది. బహుశః ఈ వ్యూహం సిద్దం చేసుకోవడానికి పాకిస్తాన్ కి మూడు రోజులు పట్టిందేమో? అప్పుడే హటాత్తుగా అది “యునైటెడ్ జిహాద్ కౌన్సిల్” ని ముందుకు తీసుకువచ్చిందేమోననే అనుమానం కలుగుతోంది. భారత్ కి బుద్ధి చెప్పేందుకే దాడికి పాల్పడ్డామని ప్రకటించుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉన్నపటికీ, అది ఖచ్చితంగా పాక్ ఎత్తుగడగానే అనుమానించవలసి వస్తోంది. దాని అధికార ప్రతినిధి సయ్యద్ సదాకత్ హుస్సేన్ మాటలు పాకిస్తాన్ పై ఈ నిందపడకుండా ఏదో విధంగా కాపాడుకోవాలన్నట్లుగా ఉన్నాయి.
“భారత ప్రభుత్వం మరియు భారత్ మీడియా రెండూ కూడా పాక్ ఫోబియాతో బాధపడుతున్నాయి. దేశంలో ఎక్కడ ఏ దాడి జరిగినా దానికి పాకిస్తాన్ నే వేలెత్తి చూపించడం వాటికి అలవాటుయిపోయింది. తద్వారా కాశ్మీరీ స్వాతంత్ర్య పోరాటంపై బురద జల్లాలని ప్రయత్నిస్తుంటాయి. కానీ రెండున్నర దశాబ్దాలుగా అవి సఫలం కాలేకపోయాయి. కాశ్మీరీల పోరాటాలను అడ్డుకోలేకపోయాయి. కాశ్మీరీ వేర్పాటువాదులు భారత్ పై దాడి చేయదలిస్తే వారిని భారత్ లో ఏ శక్తి అడ్డుకోలేదని నిరూపించడానికే మేము “హైవే స్క్వాడ్” తో కలిసి ఈ దాడి చేసి భారత్ కి ఒక గట్టి హెచ్చరిక పంపాము. కనుక భారత్ మళ్ళీ యధాప్రకారం పాకిస్తాన్ వైపు వేలెత్తి చూపే ప్రయత్నం చేసే బదులు గోడపై వ్రాసినట్లు స్పష్టంగా కనబడుతున్న మా ఈ సందేశాన్ని సరిగ్గా అర్ధం చేసుకొని ఇక ఏ మాత్రం సమయం వృధా చేయకుండా కాశ్మీరీ ప్రజలకు తమ భవిష్యత్ ని నిర్ణయించుకొనేందుకు అంగీకరించాలి,” అని అన్నారు.
అతను చెపుతున్న మాటలు తమ పోరాటం గురించి చెపుతున్నట్లుగా లేవు. పాకిస్తాన్ పై నిందపడకుండా కాపాడుకోవాలన్నట్లుగా ఉన్నాయి. కాశ్మీర్ విషయంలో పాక్ ఎటువంటి వైఖరి ప్రదర్శిస్తోందో సరిగ్గా అటువంటి వైఖరే అతను కూడా ప్రదర్శిస్తున్నాడు. కనుక అతని మాటలను పాక్ మాటలుగానే చూసినట్లయితే, ఈ సమస్య నుండి బయటపడటానికే పాక్ ఈ మార్గం సిద్దం చేసుకొంటున్నట్లు అనుమానించవలసి వస్తోంది. ఒకవేళ అతను చెప్పినట్లు నిజంగానే ఆ సంస్థే ఈ దాడికి పాల్పడిందని రుజువయితే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పై భారత వాయుసేనలు దాడి చేసి ఆ సంస్థతో సహా అక్కడ తిష్టవేసుకొని కూర్చొన్న ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టి, మళ్ళీ ఆ భూభాగాన్ని తన అధీనంలోకి తెచ్చుకొనే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం లేదు. అటువంటి ఆలోచన, ఆసక్తి ఉన్నట్లు భారత ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది కూడా.
కనుక ఈ సమస్య నుండి బయటపడేందుకు పాక్ ఇటువంటి చవకబారు ఆలోచనలు చేయడం కంటే భారత్ సార్వభౌమత్వానికి సవాలు విసురుతున్న జైష్-ఏ-మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను పూర్తిగా తుడిచిపెట్టేసేందుకు భారత్ తో చేతులు కలిపితే మంచిదేమో? కానీ అటువంటి సాహసోపేతమయిన నిర్ణయం తీసుకొనే శక్తి పాక్ ప్రజా ప్రభుత్వానికి ఉందా? అంటే లేదనే చెప్పుకోవాలి. ఒకవేళ భారత్-పాక్ సంబంధాలు మళ్ళీ దెబ్బ తింటే, మళ్ళీ కొన్ని దశాబ్దాలపాటు ఇరుదేశాల మధ్య ఈ శత్రుత్వం కొనసాగవచ్చును.