భారత్-పాక్ సంబంధాలపై పఠాన్ కోట్ ప్రభావం పడుతుందా?
posted on Jan 2, 2016 @ 8:58PM
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై శనివారం తెల్లవారు జామున ఉగ్రవాదుల దాడితో భారత్, పాక్ దేశాలు రెండూ ఉలిక్కిపడ్డాయని చెప్పవచ్చును. ఎందుకంటే పఠాన్ కోట్ ఎయిర్ బేస్ భారత్ కి చాలా కీలకమయిన వాయుసేన స్థావరం. ఈ ఎయిర్ బేస్ పాకిస్తాన్ సరిహద్దుకి కేవలం 25కిమీ దూరంలో ఉంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, చివరికి రాజధాని డిల్లీకి కూడా ఇక్కడి నుంచి కొన్ని క్షణాల వ్యవధిలో యుద్ద విమానాలు చేరుకోగలవు. అందుకే ఈ ఎయిర్ బేస్ లో ఎల్లప్పుడూ కొన్ని డజన్ల యుద్ధ విమానాలు, యుద్ద హెలికాఫ్టర్లు నిలిపి ఉంచబడతాయి. వీటిని బట్టి ఈ ఎయిర్ బేస్ ఎంత కీలకమయినదో అర్ధం చేసుకోవచ్చును. అటువంటి అత్యంత కీలక వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేయడానికి సిద్దపడ్డారు. ఒకవేళ వారు తమ ప్రయత్నంలో సఫలం అయ్యుంటే బహుశః భారత్-పాక్ మధ్య ఆకస్మికంగా యుద్ధం మొదలయినా ఆశ్చర్యం లేదేమో. కానీ అదృష్టవశాత్తు భారత జవాన్లు ప్రాణాలకు తెగించి దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టగలిగారు.
ఈ దాడిని భారత్ చాలా తీవ్రంగా పరిగణిస్తోందని పాకిస్తాన్ కూడా గ్రహించింది. అందుకే ఈ దాడి వార్తలు వెలువడగానే పాకిస్తాన్ విదేశాంగ అధికార ప్రతినిధి ఖాజీ ఖలీముల్లా మీడియాతో మాట్లాడుతూ “ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ దాడిని మేము చాలా తీవ్రమయిన విషయంగా భావిస్తున్నాము. ఇటువంటి దురదృష్టకర సంఘటన జరిగినందుకు మేము భారత్ ప్రభుత్వానికి, ప్రజలకి, దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకి మా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాము. వారు ఈ దురదృష్టకర సంఘటన తాలుక బాధ నుండి త్వరగా కోలుకోవాలని కోరుకొంటున్నాము. ఆసియా ఖండం నుంచి ఉగ్రవాద నిర్మూలన కోసం మా దేశం భారత్ తో సహా ఇరుగుపొరుగు దేశాలతో కలిసి పని చేస్తుంది,” అని అన్నారు.
ఉగ్రవాదుల దాడులపై హోం మంత్రి రాజ్ నాద్ సింగ్ మాట్లాడుతూ “మేము ఎల్లప్పుడూ శాంతినే కోరుకొంటాము. కానీ ఉగ్రవాదులు మాపై దాడులు చేస్తే మేము చేతులు ముడుచుకొని కూర్చోబోము. వారికి గట్టిగా బుద్ధి చెపుతాము,” అని అన్నారు.
ఈ పరిణామాలతో ఇప్పుడిప్పుడే మళ్ళీ చిగురిస్తున్న భారత్-పాక్ మధ్య స్నేహ సంబంధాలు దెబ్బ తింటాయేమోననే భయం ఇరు దేశాలలో వ్యక్తం అయ్యింది. కానీ ఇదివరకులాగ భారత్ తక్షణమే పాక్ పట్ల వ్యతిరేకంగా మాట్లాడలేదు. కనీసం అటువంటి సంకేతాలు కూడా ఇవ్వలేదు. ఉగ్రవాదులు చాలా కీలకమయిన వైమానిక స్థావరంపై దాడికి పాల్పడినప్పటికీ ఈసారి భారత్ చాలా సంయమనంతో వ్యవహరించిదని చెప్పక తప్పదు. కానీ ఉగ్రవాదులు మున్ముందు కూడా ఇటువంటి పరీక్షలు పెట్టే అవకాశం ఉండవచ్చును. కనుక అప్పుడు కూడా భారత్ ఇదేవిధంగా సంయమనంగా వ్యవహరించవలసి ఉంటుందనే విషయం స్పష్టం అవుతోంది.
భారత్ ఇవ్వాళ్ళ ప్రదర్శించిన ఈ సంయమనానికి ప్రతిగా పాక్ ప్రభుత్వం కూడా ఉగ్రవాద నిర్మూలనలో తన చిత్తశుద్ది నిరూపించుకొనే ప్రయత్నాలు చేయగలిగితే ఇరుదేశాల మధ్య పరస్పర నమ్మకం ఏర్పడుతుంది. ఇంతవరకు సరిహద్దులలో నిత్యం తుపాకుల మోతలు మారుమ్రోగుతుండేవి. నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్ ల మధ్య సఖ్యత ఏర్పడినప్పటి నుంచి తుపాకులు గర్జించడం మానేశాయి. కానీ పాక్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు నేటికీ భారత్ పై దాడులకు పాల్పడుతూనే ఉన్నారని ఈరోజు సంఘటనలు రుజువు చేస్తున్నాయి.
అలాగే పాక్ గూడచారి సంస్థ ఐ.ఎస్.ఐ. జమ్మూ కాశ్మీర్ మరియు పంజాబ్ రాష్ట్రాలలో గూడచర్యానికి పాల్పడుతోందని స్పష్టం అవుతోంది. ఈ దాడులకు ఐ.ఎస్.ఐ. చేస్తున్న గూడచర్యానికి మధ్య ‘లింక్’ ఏర్పడితే అప్పుడు కూడా భారత్ ఇదేవిధంగా సంయమనం పాటించడం చాలా కష్టం. కనుక పాకిస్తాన్ ఇటువంటివాటినన్నిటినీ అరికట్టే ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. అప్పుడే ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు బలపడే అవకాశం ఉంటుంది.