బెంగాల్లో బీజేపీ గెలిస్తే తెలంగాణలో ప్రకంపనలే!
posted on Feb 27, 2021 @ 3:55PM
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’ సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.
పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.
పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.
ఇప్పటికే తెలంగాణ బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..