అధ్యక్ష తరహా పాలన! మోడీ మనసులో మాట..
posted on Feb 25, 2021 @ 3:39PM
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో బీజేపీ కి ఆశించిన ఫలితాలు వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.
పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.
అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం.
అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.
అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.
ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే ఉంది. నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్ పటేల్ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు.
ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.
ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.
ఇప్పటికే బీజేపీ 12 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి మోడీ అలోచన కార్యరూపం దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.