పైసా వసూల్.. పైసా కొట్టు.. కొట్టు నడుపు
posted on Mar 16, 2021 @ 12:47PM
సంపాదించే వాడు ఒకడైతే ఆ సంపదను అనుభవించే వాడు మరొకడు.. కలోగంజి కోసం కొందరు చిరు వ్యాపారాలు చేసుకుంటూ.. తల్లిదండ్రుల మందులు.. పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులు ఎల్లదీస్తు ఏదో జీవనం కొనసాగిస్తుంటే.. చిరువ్యాపారులు మాంసపు ముద్దలను గడ్డలా ఎత్తుకు పోతున్నారు.. పోలీసులు, ఆయా ఏరియాలో పలుకుబడి ఉన్న మంది. అదేంటి అలాంటి సీన్లు సినిమాలో కదా ఉండేది అనుకుంటున్నారా.. ఈ దునియాలో అలా బతికేవాళ్లు చాలా మందే ఉన్నారు. పోలీసులు హైదరాబాద్ లో ఎప్పటి నుంచో చిరువ్యాపారులు దగ్గర వసూల్ చేస్తున్న పద్ధతి ఇప్పుడు ట్రెండ్ మారింది.. పోలీసులు లే కాదు మాములు వాసులు చేసేది ఆ ఏరియాలో అంతో ఇంతో పలుకుబడి ఉన్న వాడు కూడా మాములు వసూల్ చేస్తున్నారు.. వ్యాపారం చేసుకో! రోజూ రూ.200.. రాత్రి పది దాటితే రూ.500ల పైనే చిరువ్యాపారుల నుంచి వసూళ్ల దందా
వేసవి కాలం వచ్చిందంటే కొబ్బరి బోండాలు, సోడా బండ్లు, చెరుకు రసాలు, పళ్ల రసాల కొట్లు.. ఇలా వందల్లో దుకాణాలు ప్రధాన రహదారుల పక్కన వెలుస్తుంటాయి. ఇతర వ్యాపారాలు, ఉద్యోగాలూ వదిలి ఈ సీజన్ మొత్తం వీటిమీదే బతికేవాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు. ఇప్పుడు వీరినే లక్ష్యంగా దోచేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఇక్కడ వ్యాపారం నడవాలంటే రోజూ వీరి చేతులు తడపాల్సిందే. సర్కారు ఖాళీ స్థలాల్ని సైతం తమ సొంత జాగాగా చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడుతున్న వారు కొందరైతే.. ఫుట్‌పాత్ మీదా, రోడ్డు పక్కన వ్యాపారం నడవాలంటే డబ్బులు కట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్న వారిలో కొందరు పోలీసులు, బల్దియా సిబ్బంది ఉండటం గమనార్హం. మరోవైపు రాత్రి 10 గంటలు దాటిందంటే ఆ తర్వాత కొట్టు తెరిచి ఉండాలంటే నిర్వాహకుల నుంచి రూ.500 నుంచి ఆపైన వసూలు చేస్తున్నారు కొందరు పెట్రోలింగ్ సిబ్బంది.
గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి వెనకాల గల్లీలో ఓ నివాసం. ఆ ఇంటిని ఆనుకుని రోడ్డు పక్కన నెలరోజుల నుంచి చెరుకు రసం బండి నడుపుతున్నారు ఓ మహిళ. గతంలో పేట్‌బషీరాబాద్‌లో ఇదే వ్యాపారంలో ఉన్న ఆమె ఇక్కడ ఖాళీ స్థలం ఉందని తెలిసి బండి పెట్టుకున్నారు. అయితే పక్కనే ఉన్న ఇంటి యజమాని ఆమె నుంచి నిత్యం రూ.100 వసూలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఆ స్థలం తనదేనని చెబుతున్నాడని.. ఖర్చులు పోనూ రోజూ రూ.200 మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారా మహిళా వ్యాపారి.
బేగంపేట ప్రధాన రహదారి పక్కన ఓ పండ్ల రసం కొట్టు. ఆ వ్యాపారితో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలకు జీవనాధారం ఇదే కొట్టు. ప్రతిరోజూ ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన వద్దకు రావడం రూ.100 నుంచి రూ.200 దాకా అడుక్కెళ్లటం మామూలుగా మారింది. రోజూ వచ్చిన సంపాదనలో మిగిలేది రూ.300 నుంచి రూ.400. అందులో పెద్దమొత్తం ఆ కానిస్టేబుల్ తీసుకెళ్లడంతో భారంగా ఉందని వాపోతున్నాడా చిరువ్యాపారి. ఇదేంటని అడిగితే ఇవ్వకపోతే ఇక్కడి నుంచి బండి తీసేయిస్తారని చెప్పడం గమనార్హం.
కేపీహెచ్‌బీ ప్రధాన రహదారిపై ఓ టీ కొట్టు. రాత్రి 10 దాటితే ఓ పెట్రోలింగ్ వాహనం సైరన్ వేసుకుని వచ్చి కొంచెం దూరంలో ఆగుతుంది. టీకొట్టు నిర్వాహకుడు ఓ పేపర్లో రూ.200 నుంచి రూ.500 వరకు పెట్టి తీసుకెళ్లి గుట్టుగా ఆ వాహనంలో ఇచ్చేసి వస్తాడు. ఇదే తంతు ఇక్కడ ప్రతిరోజూ దాదాపు ప్రతి దుకాణంలోనూ జరుగుతోంది.
నైట్ డ్యూటీ తో పాటు వ్యాపారులను లూటీ
నగరంలో పలు టీకొట్లు, హోటళ్లు, పాన్‌షాపుల వద్ద రాత్రికాగానే ఓ వాహనం వచ్చి ఆగుతుంది. ఓ పోలీస్ దిగి చేతిలో ఉన్న ట్యాబ్‌తో ఫొటోలు తీస్తారు. బేరం కుదిరితే సరి లేకుంటే బండెక్కిస్తారు. ఇదే తంతు ప్రతిరోజూ నగరంలో చాలాచోట్ల జరుగుతోంది. ఎర్రగడ్డ నుంచి మొదలుకుని కేపీహెచ్‌బీ మెట్రో వరకూ ప్రధాన రహదారిపై ఉన్న దాదాపుగా అన్ని చిరువ్యాపార కేంద్రాల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇటీవల వెస్ట్‌జోన్ పరిధిలో రాత్రి పెట్రోలింగ్ పోలీసులు కొందరు గూగుల్‌పే ద్వారా మామూళ్లు వసూలు చేయడంపై ఫిర్యాదులు రావడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అడుక్కునే వాడే నయం అనిపించేలా ప్రవర్తిస్తున్నారు. పోలీసులు, ఆకు రౌడీల వ్యవహారం.. ఎవరైనా తప్పుచేస్తే పోలీసులకు కంప్లీట్ చేస్తాం పోలీసులే ఇలాంటి దారుణాలకు పాలుపడుతుంటే తాము ఎవరికి చెప్పుకోవాలని చిరువ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.