విశాఖకు ఆరుగురు డిప్యూటీ మేయర్లు!
posted on Mar 16, 2021 @ 12:05PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించడం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన వారు ఉన్నారు... స్వాగతించిన వారు ఉన్నారు. తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదనతో మరో సంచలనానికి తెర తీశారు జగన్. మూడు రాజధానుల ప్రతిపాదనపై వివాదం ఇంకా కొనసాగుతోంది. తాజాగా సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో నెగ్గిన వైసీపీ అధిష్టానం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుడుతోందని.. ఉప ముఖ్యమంత్రుల ఫార్ములాను విశాఖ కార్పోరేషన్ విషయంలోనూ అమలు పర్చే దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
అన్ని కార్పొరేషన్ల మాదిరిగానే విశాఖకు ఒక మేయర్ ఉంటారు. కానీ డిప్యూటీ మేయర్ల విషయంలో మాత్రం కొత్తగా ఆలోచిస్తున్నారట జగన్. విశాఖ మేయర్ పదవి బీసీ జనరల్ కు రిజర్వ్ అయ్యింది. అయితే మేయర్ పదవిని బీసీ జనరల్ కు కాకుండా.. బీసీ మహిళకు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖ కార్పొరేషన్ లో 8 నియోజకవర్గాలు ఉన్నాయి. విశాఖ తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తరతో పాటు గాజువాక, అనకాపల్లి, పెందుర్తి, భీమిలి ఉన్నాయి. ప్రతీ నియోజకవర్గానికి ఒక డిప్యూటీ మేయర్ ని నియమించాలని జగన్ ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. అయితే అన్ని నియోజకవర్గాలు అంటే సంఖ్య మరీ భారీగా అవుతుందనే ఆలోచనతో నలుగురు లేదా ఆరుగురు డిప్యూటీ మేయర్లను నియమించే అవకాశం ఉందని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సామాజికవర్గం కోణం నుంచే కాకుండా పాలనాపరంగా కూడా ఇది కొత్త విధానం అవుతుందని భావిస్తున్నట్టు సమాచారం.చదువుకున్న వారు, మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని కూడా తెలుస్తోంది. అలాంటి నిర్ణయం తీసుకుంటే విశాఖ కార్పొరేషన్ ఏపీ రాజకీయ చరిత్రలో కొత్తగా నిలవనుంది.
జగన్ ఆలోచనకు చాలానే కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. జీవీఎంసీలో మొత్తం 98 డివిజన్లు ఉన్నాయి. వైసీపీకి చెందిన అభ్యర్థులు 58 మంది గెలుపొందారు. వీరిలో ఆశావాహులు చాలామంది ఉన్నారు. మేయర్ పదవి బీసీ జనరల్‌కు రిజర్వు అయినా.. మహిళకే మేయర్ పదవి ఇస్తారనే ప్రచారం ఉంది. దీంతో మిగిలిన ఆశావాహుల నుంచి వ్యతిరేకత ఎదురవ్వకుండా ఉండేందుకు ఎక్కువమంది డిప్యూటీ మేయర్ల ప్రతిపాదన తెరపైకి తెచ్చినట్టు తెలుస్తోంది.
టీడీపీని బలహీన పర్చాలి అంటే బీసీ ఓటర్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వడమన్నది రెండో లక్ష్యం. ఇతర నగరాలతో పోల్చుకుంటే విశాఖలో టీడీపీకి మంచి పట్టు ఉంది. తాజాగా గ్రేటర్ విశాఖ ఎన్నికల్లోనూ మరోసారి అది రుజువు అయ్యింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ విశాఖలో నాలుగు అసెంబ్లీ స్థానాలు నెగ్గగా.. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి బాగానే ఓట్లు పడ్డాయి. 30 స్థానాలను సొంతం చేసుకుంది. టీడీపీ మద్దతుతో మరో ఇద్దరు గెలిచారు. ఇక వైసీపీ నెగ్గిన చోట కూడా అత్యల్ప ఓట్లతోనే విజయం సాధించిన డివిజన్లు ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం విశాఖలో బలంగా ఉండే బీసీ సామాజిక వర్గం టీడీపీకి అండగా ఉండటమే అంటున్నారు. అందుకో బీసీ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారని చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి టీడీపీ పూర్తిగా దెబ్బ కొట్టాలి అంటే బీసీ ఓటర్లను ఆకర్షించుకోవాలన్నది వైసీపీ వ్యూహాంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆరుగురు డిప్యూటీ మేయర్ల అంశం తెరపైకి తెచ్చారని తెలుస్తోంది.