ప్రాణాలు తీస్తున్న హైద్రాబాద్ పరిశ్రమలు
posted on Aug 16, 2012 @ 9:59AM
హైదరాబాద్ నగరం శివార్లలోని పలు పరిశ్రమల్లో భద్రతాలోపం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. తరుచుగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కార్మికులు గాయాలపాలవుతున్నారు. వరుసగా నెలరోజుల్లో కనీసం 20రోజుల పాటు నగర సమీపంలోని పలు ప్రాంతాల్లో పేళుళ్లు సంభవిస్తున్నాయి. ఒకసారి టపాకాయల మందు వల్ల ప్రమాదం సంభవిస్తే, మరోసారి గ్యాస్‌పేలి ప్రమాదం జరుగుతోంది. ఇలా ప్రమాదాల పరంపరలో రంగారెడ్డి జిల్లా మొత్తం ఇలానే కనిపిస్తోంది. అదీ పక్క జిల్లాలకు కూడా పాకినట్లుంది. తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్‌పట్టణ శివార్లలోని స్టీలుకోర్ పరిశ్రమలో ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు గాయపడ్డారు. సిలెండర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని గుర్తించారు. క్షతగాత్రులను షాద్‌నగర్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. అందుకే వీరిని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తరుచుగా ఇటీవల కాలంలో ఈ తరహా వార్తలు పత్రికల్లో ప్రచురితమవుతున్నా కార్మికశాఖ నిద్రలేచినట్లు లేదని కార్మికసంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. ముందస్తు భద్రతాచర్యలు పాటించని పరిశ్రమల లైసెన్సులు క్యాన్సిల్ చేసే అథికారం ఉన్నా కార్మికశాఖ కనీస చర్యలు తీసుకోవటం లేదని విమర్శలు ఎక్కువయ్యాయి.
ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా లేబర్‌బోర్డును నెలకొల్పిన ప్రభుత్వం ఈ భద్రతాచర్యలు అంశంపై ముందస్తుగా చర్చించి సరైన పరిష్కారం చూపకపోతే కార్మికశాఖను పరిశ్రమల యజమానులు కొనుగోలు చేసుకుంటారన్న విమర్శలను అంగీకరించాల్సిందేనని కార్మికప్రతినిధులు డిమాండు చేస్తున్నారు. కనీసం హెల్మట్లు ధరించి పనికి వెళ్లే పరిశ్రమల సంఖ్య నానాటికీ తగ్గిపోయిందని వారు అంటున్నారు. కార్మికభద్రతపై ప్రభుత్వం స్పందించి పరిశ్రమలకు కఠినతరమైన హెచ్చరికలు చేయకపోతే భవిష్యత్తులో మరిన్ని ప్రమాదాలు తప్పవని ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.