పోలీసాయన మానవత్వం
posted on Jul 10, 2022 @ 5:23PM
మడిసన్నాక కూసింత కళా పోసన వుండాల.. అంటాడు ముత్యాల ముగ్గు సినిమాలో కూసింత హాస్యప్రియత్వం ఉన్న విలన్. మడిసన్నాక కాస్తంత మానవత్వమూ చూపాలి అంటున్నాడు ఓ పోలీసాయన. ఎర్రటి ఎండలో మనం చాలా జాగ్రత్తలు పాటిస్తుంటాం. బయటికి వెళ్లేటప్పుడు మంచిచెప్పులు, గొడుగూ కూడా పట్టుకుంటాం. అసలు సాధ్యమైనంత వరకూ ఎండపొడ తగలకుండానే జాగ్రత్త పడుతూంటాం. కూల్‌డ్రింక్‌లు, ఐస్ క్రీమ్‌ల మద్దతు ఎలాగూ తీసుకుంటాం.
కానీ ఇవేవీ లేకుండానే పనిచేస్తుండే వారూ వుంటారు. పని మీద దృష్టితో ఎండకీ, వానకీ భయపడరు. ఎండా కాలంలో తలకి క్యాప్ మాట దేవుడెరుగు అసలు కాళ్లకి మామూలు స్లిప్పర్లయినా లేకుండా పనులు చేసే కార్మికులు వుంటారు. సామాన్లను ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి తీసికెళ్లే రిక్షా బండి వారు రోజు గడిచాక వచ్చే నాలుగు డబ్బులు లెక్కేసుకోవడానికి సూర్యుడి వేధింపులను పెద్దగా పట్టించుకోరు.
అలా తిరుగుతూనే వుంటారు. సోడా తాగుతారు, కాస్తంత ఓ క్షణం సేద తీరుతారంతే. పూర్తి స్థాయి ఎండవేడిమి నుంచి రక్షణ గురించిన ఆలోచన వారిలో చాలా మందికి వుండదు. ఔను మరి రెక్కాడితేనే డొక్కాడే బతుకులు వారివి. అలాంటి శ్రామికుడి అవస్థను కళ్లారా చూశాడు ఓ పోలీసు. వెంటనే దగ్గరున్న చెప్పుల దుకాణానికి వెళ్లి స్లిప్పర్లు కొనిచ్చాడు. బహుశా ఆ బండి వాడిని చాలా రోజులుగా గమనిస్తున్నాడేమో. అతని అవస్థను చూస్త న్నాడేమో.. మనసు కదిలింది. వెంటనే తాను చిన్న సాయమైనా చేయాలనుకుని చెప్పులు కొనిచ్చాడు.
బండి వాడికి పరమ సంతోషం కలిగింది. చక్కగా నవ్వేడు. అదే భగవదాశీర్వాదం అనుకున్నాడు ఆ పోలీసాయన. ఇలాంటి సంఘటనలు జరుగు తూంటాయి. మానవత్వం అనేది పెద్ద పెద్ద పనుల్లోనే చూపాలని లేదు.. ఇలాంటి బహు చిన్న పనితోనూ చూపవచ్చు. కావడానికి స్లిప్లర్లు కొనివ్వడం చిన్నపనే కావచ్చు.. కానీ దాని వల్ల ఆ బండివాడిలో కలిగిన ఊరట లెక్కలేనంత. పోలీసాయన తృప్తికీ విలువకట్టలేము. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి నెటిజన్లకు అందించాడు. పోలీసాయనపై ప్రశంసల జల్లు కురిపించారు. మనమూల శభాష్ అందామా!