వానలే వానలు.. తడిసి ముద్దైన తెలంగాణ
posted on Jul 11, 2022 6:55AM
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నింగీ నేలా ఏకమైందా అన్నంతగా గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కాళేశ్వరం, శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇక భారీ వర్షాలకు బోధన్ నియోజకరవ్గంలోని రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం దగ్గర.. గోదావరి పోటెత్తి ప్రవహిస్తోంది. గ్రామాల్లో చెరువులు అలుగు పారుతున్నాయి.
నవీపేట మండలంలో కాలువకు గండి పడటంతో .. జాన్నేపల్లి నుంచి నలేశ్వర్ వరకు పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో భారీ వర్షాలకు రేకుల ఇల్లు కూలిపోయిం ముగ్గురు గాయపడ్డారు. విషయం తెలుసుకున్న సత్తుపల్లి మండలం కిష్టాపురం-చెరుకుపల్లి, కిష్టాపురం-జగన్నాధపురం గ్రామాల మధ్య .. చౌటువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో .. భారీ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొత్తగూడెంలో ఓపెన్ కాస్ట్ గునుల్లో కూడా బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీరు చేరడంతో బొగ్గు వెలికితీత నిలిచిపోయింది.
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామం అంతర్ రాష్ట్ర వంతెన దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ఉగ్రరూపం దాల్చింది. ఇలా ఉండగా తెలంగాణలో భారీ వర్షాల కారణంగా సోమవారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో వర్షాలపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.