బాణోత్ చంద్రావతికి టీఆర్ ఎస్ పెద్దల మద్దతు ?!
posted on Jul 10, 2022 @ 5:12PM
రాజకీయాల్లో చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. కొందరు పనిగట్టుకుని వస్తారు. కొందరు తప్పనిస్థితిలో వస్తారు. ఇంకొందరు సీనియర్ల స్పూర్తితో వస్తారు. బాణోత్ చంద్రావతి తప్పని స్థితిలో రాజకీయరంగ ప్రవేశం చేశారు. ఆమె మెడిసిన్ చదివారు. ప్రాక్టీస్ కూడా ఆరంభించాక వూహించని విధంగా ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో సీపీఐ అభ్యర్ధిగా ఖమ్మం జిల్లా వైరా నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పట్లో విద్యాధికురాలుగా అందరి అభిమానం చూరగొన్నారు. అందువల్ల సునాయాసంగానే గెలిచారామె. తర్వాత తెలం గాణా ఏర్పడినపుడు ఆమె టిఆర్ ఎస్‌లో చేరారు. తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలయ్యారు.
2014లో వైసీపీ నుంచి వైరా అభ్యర్థిగా పోటీ చేసిన మదన్‌లాల్ విజయం సాధించిన అనంతరం తెరాసలో చేరారు. ఇక 2018 డిసెంబర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన రాములునాయక్ అనూహ్యంగా విజయం సాధించి అనంతరం తెరాసలో చేరారు. ఇలా మాజీలు అందరూ ఒకే గూటికి చేరి, టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. గత జూన్ 11న ఖమ్మంలో పర్యటించిన తెరాస కార్య నిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో చాలా మంది సిట్టింగ్‌లకు టికెట్ దక్కదన్న విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. దీంతో తీవ్రమైన నిరాశా నిస్ఫృహలకు గురైన ఎమ్మెల్యే రాములునాయక్ , అనంతరం జరిగిన పలు సభల్లో కాంగ్రెస్ పార్టీని, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని పొగడ్తల్లో ముంచెత్తారు. తనకు టిఆర్ ఎస్ టికెట్ దక్క దన్న ఆవేదన రాములు నాయక్ మాటల్లో వ్యక్తమైంది. దీంతో పాటు మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ సైతం అనుకున్నంత ఉత్సా హంగానూ కనిపించడం లేదు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరునిగా 2014లో వైసీపీ టికెట్ సంపాదించి, అనంతరం జరిగిన ఎన్నికల్లో గెలిచారు. అయితే టీఆర్ ఎస్‌లో చేరాక తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజకీయంగా అండగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి దూరమయ్యా రు. అదే సమయంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సన్నిహితునిగా మారారు. ఓటమి పాలైనప్పటికీ నియోజక వర్గంలో చురుగ్గా పర్యటిస్తూ వచ్చే ఎన్నికల్లో తెరాస టికెట్ తనదేనని, తన గెలుపు నల్లేరుపైన నడకేనని ఆయన చెబుతున్నా రు. దీంతో ఈసారి వైరా అసెంబ్లీ స్థానానికి తెరాస తరపున ముగ్గురు పోటీపడే పరిస్థితి ఉంది. మరి ఎవరికి టికెట్ లభిస్తుందో, ఎవరు మరోసారి ఎమ్మెల్యేగా శాసనసభలోకి అడుగుపెడతారో తేలాల్సి ఉంది.ఈ మధ్య కాలంలో తరచుగా నియోజకవర్గంలో చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్న బాణోత్ చంద్రావతి టిఆర్ ఎస్ తరపున వచ్చే ఎన్నికల్లో తానే అభ్యర్థిని అని చెప్పుకుంటున్నారు.
ఈమేరకు మంత్రి కేటీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చినట్టు ఆమె చెప్పుకుంటున్నారు. దీన్లో భాగంగానే ఆమె తన పర్యటినలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్వతహాగా సీపీఐ ఫ్యామిలీగా ముద్రపడిన చంద్రావతి కుటుంబం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వర్రావుకు సన్నిహితంగా ఉంటూ వస్తోంది.
దీంతో జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మద్దతు సైతం చంద్రవతికి దక్కే అవకాశం ఉంది. బహుశా ఆ ధీమా తోనే చంద్రవతి ఉండవచ్చు. పార్టీ తరపున పనిచేస్తున్న పీకే ఇటీవల నిర్వహించిన సర్వేలో సుమారు నలభై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశం ఉందన్న నివేదికలు పార్టీ అధినేతకు వెళ్లాయి. ఫలితంగా పార్టీకి భారంగా పరిణమించిన ఆయా ఎమ్మెల్యేలకు అక్కడ స్థానికంగా సరైన ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆ ధీమాతోనే చంద్రవతి తన పని తాను చేసుకునిపోతున్నారు. ఇలా ఒకే స్థానం నుంచి ముగ్గురు ఆశావహులు బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకోవడం టిఆర్ ఎస్ కు తలనొప్పిగా మారే పరిస్థితి ఉంది.