చేరుతారా? చేరరా? పొంగులేటి, జూపల్లి డైలమా ఇంకెన్నాళ్లు?
posted on May 5, 2023 @ 11:26AM
సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఉంటాయి. అందుకు తెలంగాణలో ఉత్కంఠ భరితంగా నడుస్తున్న ‘పొంగులేటి..జూపల్లి’ పొలిటికల్ డ్రామాయే ఉదాహరణ అంటున్నారు. పొంగులేటి ఏ పార్టీలో చేరతారు? జూపల్లి దారెటు? అనే చర్చ ఎడతెగకుండా మారుతూనే ఉంద. ఈ పార్టీ.. కాదు కాదు ఆ పార్టీ అంటూ లీకులు వస్తూనే ఉన్నాయి. అయితే వారిరువురూ మాత్రం ఒక విషయంలో మాత్రం స్పష్టత యిస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా చెబుతున్న వారిరువురూ తమ మొగ్గు బీజేపీవైపా, కాంగ్రెస్ వైపా అన్న విషయంలో మాత్రం స్పష్టత యివ్వడం లేదు.
ప్రధానంగా, రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితిలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదనీ, అదే జరిగితే కాంగ్రెస్, బీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమనీ, అది తమకు ఇష్టం లేదని ఆ ఇద్దరు నేతలు తమ సన్నిహితుల వద్ద చెబుతున్నారని, ఈ నేపథ్యంలోనే వీరిరువురూ కమలం గూటికే చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. అలాగే మరి కొందరు ముఖ్యనాయకులు, బీఆర్ఎస్ తో ప్రీ పోల్ కాకున్నా పోస్ట్ పోల్ అలయన్స్ తప్పదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. అలాగే జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు సాగుతున్న ప్రయత్నాలలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఏదో ఒక స్థాయిలో పొత్తు తప్పదనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల నుంచే వినిపిస్తోంది. అందుకే రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనను దీటుగా ఎదుర్కొనగలిగేది ఒక్క బీజేపీ మాత్రమేనని పొంగులేటి, జూపల్లి భావిస్తునట్లు చెబుతున్నారు.
మరో వంక బీజేపీ నాయకుల వద్ద నుంచి ఈ యిరువురికీ స్పష్టమైన హామీ కూడా లభించిందని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా పొంగులేటి, జూపల్లి ఏ గూటికి చేరుతారన్న విషయంలో వారు యిప్పటికీ క్లారిటీ యివ్వలేదు. మొత్తం మీద తాజాగా బీజేపీ చేరికల కమిటీ పొంగులేటి, జూపల్లితో సుదీర్ఘ చర్చలు జరిపింది. దాదాపు గంటల పాటు జరిగిన చర్చల అనంతరం కూడా వీరి దారెటు? ఏ పార్టీలో చేరుతారు అన్న విషయంలో స్పష్టత రాలేదు.
పొంగులేని శ్రీనివాసరెడ్డి నివాసంలో బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, సభ్యులు రఘునందన్ రావు.. విశ్వేశ్వర రెడ్డి.. యెన్నం శ్రీనివాస రెడ్డి తదితరులు కలిసి నిర్వహించిన ఐదు గంటల సమావేశం అనంతరం కూడా పొంగులేటి, జూపల్లి రాజకీయ అడుగులు ఏ పార్టీ వైపు అన్న విషయం తేలలేదు