జగనాసుర పాలనకు నాలుగేళ్లు
posted on May 5, 2023 @ 12:50PM
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరో మూడు వారాల్లో నాలుగేళ్లు పూర్తి చేసుకుంటుంది. 2019 మే 30 తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఒక్క ఛాన్స్ అని వేడుకున్న జగన్ రెడ్డి, ప్రమాణ స్వీకారం వేదిక నుంచే, ఆరు నెలల్లో అద్భుతాలు సృష్టిస్తానని, బ్రహ్మాండం బద్దలు చేస్తాని ప్రజలకు వాగ్దానం చేశారు. వరస పెట్టి హామీలు గుప్పించారు. కానీ, ఆరు నెలలు కాదు కదా నాలుగేళ్లు పూర్తయ్యే సమయానికి కూడా రాష్ట్రం ప్రగతి దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు ముందుకు పడలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగు పడలేదు సరికదా పాతాళానికి దిగజారింది. ఈ నాలుగేళ్లుగా ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ ల మీదే బండి లాగించేస్తోంది. ప్రస్తుతం యిక అప్పులు కూడా పుట్టని దివాలా దశకు చేరుకుంది.
అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నాలుగేళ్ల సుందర ముదనష్ట పాలనలో పాతాళానికి జారింది ఒక్క ఆర్థిక రంగమేనా, మిగిలిన వ్యవస్థలన్నీ బాగున్నాయా? అంటే ఏ వర్గం నుంచీ ఆఖరికి సొంత పార్టీ శ్రేణుల నుంచి కూడా ఔననే సమాధానం రావడం లేదు. ఏ రంగానికి ఆ రంగం, ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ దినదిన ప్రవర్తమానంగా దిగజారి ఆఖరి మెట్టుకు చేరుకున్నాయి. శాంతి భద్రతల పరిస్థితి గురించైతే చెప్పనే అక్కర్లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తిరుమలలో కూడా గంజాయి, మద్యం యథేచ్ఛగా లభ్యమౌతున్నాయి. హత్యాయత్నాలు జరుగుతున్నాయంటే రాష్ట్రంలోని యితర ప్రాంతాల పరిస్థితి ఎలా ఉందో తేలికగానే అర్ధమౌతుంది.
రాష్ట్రప్రగతికి అత్యంత కీలకమైన పారిశ్రామిక రంగం పురోగమించడానికి, పెట్టుబడులను ఆకర్షించడానికి శాంతి భద్రతలు కీలకం. కానీ, జగన్ రెడ్డి పాలనలో అరాచకత్వమే రాజ్యమేలుతోంది. ఆయన పాలన ఆరంభించడమే విధ్వంసం, కూల్చివేతతో .. మొదలు పెట్టారు. రాజకీయ కక్ష సాధింపుకు అంకురార్పణ చేశారు. ప్రజావేదిక కూల్చివేతతో ఆరంభించిన ఆయన విధ్వంస పాలన నాలుగేళ్లుగా అలాగే కొనసాగుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి పునాదిగా నిలుస్తుందని అంతా ఆశించిన అమరావతిని నిర్వీర్యం చేశారు. అధికార వికేంద్రీకరణ అంటూ. మూడు రాజధానుల పేరిట అభివృద్ధి ఆశలను ఆర్పేశారు. అందుకే రాష్ట్రం రాజధాని లేకుండా నిర్భాగ్యంగా మిగిలిపోయింది.
రివర్స్ టెండర్ల పేరుతో ప్రగతికి హాలిడే ప్రకటించారు. పోలవరం సహా తెలుగు దేశం ప్రభుత్వం మొదలు పెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం ఎక్కడికక్కడే నిలిచిపోయింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పునాదులుగా నిలిచే అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. ఆయన పాలనా వైభోగానికి నిదర్శనంగా జగన్ స్వయంగా దావోస్ వెళ్లి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్నా ఒక్క రూపాయి పెట్టుబడులు రాలేదు. యిక ప్రశాంతతకు మారుపేరైనా కోనసీమలో జగన్ సర్కార్ పెట్టిన రాజకీయ, కుల చిచ్చు కోనసీమ సరిహద్దులు దాటిపోయి కాల్చేస్తోంది. ఒక్క కోనసీమ అనేమిటి రాష్ట్రం అంతటా జగన్ సర్కార్ కాష్టం రగిల్చింది. అరాజకత్వం పేట్రేగిపోయింది. అధికార పార్టీ ఎమ్మెల్సీ తమ కారు డ్రైవర్ ను హత్య చేసి శవాన్ని స్వయంగా డోర్ డెలివరీ చేస్తారు. ఒక మంత్రి ఇంటిని సొంత పార్టీ (వైసీపీ)మూకలు తగులపెట్టినా చర్యలు ఉండవు.
యిక వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే నవరత్నాలు నవ్వుల పాలవుతున్నాయి. జగన్ రెడ్డి ప్రభుత్వ్వం ఓటు బ్యాంకు సృష్టించుకునే దురాలోచనతో సంక్షేమ పథకాలకు అనవసరమైన ప్రాధాన్యాత ఇచ్చింది. ఆదాయ మార్గల విషయాన్ని పూర్తిగా విస్మరించి అభివృద్ధిని అటకెక్కించి, అప్పులు చేసి మరీ, సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసింది. అయినా, చివరకు అప్పులే మిగిలాయి కానీ హామీలు అరకొరగానే అమలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద కుటుంబానికి, ఏడాదికి రూ. మూడు నుంచి ఐదు లక్షలు ప్రయోజనం చేకూరుస్తామని ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది.
కానీ అది జరగకపోగా.. తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో అమలైన, అన్న క్యాంటీనలు మొదలు విదేశీ విద్యాపథకం వరకూ అనేక పథకాలను జగన్ రెడ్డి ప్రభుత్వం అటకెక్కించేసింది. ఇంకొన్ని పథకాలకు అర్హతలను కుదించి, అర్హుల సంఖ్యలో కోత విధించి భారాన్ని తగ్గించుకుంది. అందుకే, జగన్ రెడ్డి నాలుగేళ్ల పాలన పట్ల అన్ని వర్గాలలోనూ అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఈ మాట ఎవరో రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే చెప్పడం లేదు.. వైసేపీ అభిమానులు, శ్రేణులే చెబుతున్నాయి. యిక జగన్ పాలనలో అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఈ నాలుగేళ్ల కాలంలో జగన్ సర్కార్ అధ్వాన నిర్ణయాలను అమలు చేసి కోర్టుల అక్షింతలు వేయించుకోని అధికారి లేడంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. తాజాగా యిద్దరు ఉన్నతాధికారులు సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబు, ఐపీఎస్ ద్వారకా తిరుమల రావులకు నెల రోజులు జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు చెప్పింది.
యిందుకు వారు కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడమే కారణం. తమ సర్వీసును క్రమబద్దీకరించే విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ కొందరు ఆర్టీసీ ఉద్యోగులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు వారి సర్వీస్‌ను క్రమబద్దీకరించాలని వారి జీతాలకు ఏడు శాతం వడ్డీ కలిపి ఇవ్వాలని 2022 ఆగస్టులో హైకోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వం ఆ ఆదేశాలను అమలు చేయలేదు. దీంతో ఆ ఉద్యోగులు కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. అధికారుల తీరుపై మండిపడింది. జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.
కోర్టు ఉత్తర్వులను ఆ అధికారులు అమలు చేయకపోవడానికి కారణమేమిటో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. యిలా జగన్ హయాంలో ప్రభుత్వ తప్పిదాలకు అధికారులు శిక్షలు అనుభవించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక జగన్ సర్కార్ యిచ్చిన ఎన్ని జీవోలను కోర్టులు తప్పుపట్టాయో లేక్కే లేదు. మొత్తంగా జగన్ నాలుగేళ్ల పాలన అన్ని విధాలుగా అధ్వానంగా ఉందనీ, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.