కొత్త బడ్జెట్ పై కోటి ఆశలు .. శతకోటి సందేహాలు!
posted on Jan 18, 2023 @ 1:40PM
బడ్జెట్ అనగానే, అందరికీ కామన్ గా ఉండే కోర్కెలు కొన్నుంటాయి. మరో వంక ఎవరి లెక్కలు వారి కుంటాయి. ఎంత కాదనుకున్నా ఎవరికివారు నాకేంటి? అని ప్రశ్నించు కుంటారు. అయితే, ఎవరి కోర్కెలు ఎలా ఉన్న సర్కార్ వారి ప్రాధాన్యతలు సర్కార్ వారి కుంటాయి. చివరకు మన తెలుగింటి కోడలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ బడ్జెట్ ను ఎంత రుచిగా, శుచిగా సిద్దం చేస్తారో... ఎంత చక్కగా వండి వార్చి వడ్డిస్తారో... చూడవలసిందే. తినబోతూ రుచులేందుకు అనుకోవలసిందే.
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్, ఫిబ్రవరి 1న వరసగా ఐదవ సారి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం, 2023- 2024 వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించనున్నారు. గత మూడేళ్ళుగా కొవిడ్ మహమ్మారి కారణంగా దెబ్బ తిన్న దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది. అలాగే పైపైకి పరుగులు తీసిన ద్రవ్యల్బణం కూడా గడచిన రెండు మూడు నెలలుగా మెల్ల మెల్లగా ఒక్కో మెట్టూ దిగి వస్తోంది.
నిజానిక ,కొవిడ్ అనంతర కాలంలో ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ అధికారులకు బడ్జెట్ కసరత్తులో ఎంత ఒత్తిడి ఎదుర్కున్నారో వేరే చెప్పనక్కరలేదు. అయుతే ఈసారి ఆ ఒత్తిడి కాసింత తగ్గింది. నిధుల కేటాయింపు విషయంలో కొంత మేరకు వెసులు బాటు కలిగిందని అనుకోవచ్చునని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే అదే సమయంలోప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కునారిల్లుతున్న నేపథ్యంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ఎంత మాత్రం అభిలషనీయం కాదని, ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తునారు కూడా.
అదలా ఉంటే వచ్చేది ఎన్నికల సీజన్ ... 2023లో తొమ్మిది రాష్ట్రాల శాసన సభ ఎన్నికలతో పాటుగా, 2024 లోక్ సభ ఎన్నికలకు కూడా ఈ బడ్జెట్టే దిక్సూచి. వచ్చే సంవత్సరం 2024 ఏప్రిల్, మే నెలలలో లోక్ సభ ఎన్నికలు ఉంటాయి కాబట్టి, ఎన్నికలకు ముందు ప్రస్తుత మోడీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో ఈ బడ్జెట్ పై అంచనాలు అధికగానే ఉన్నాయి. అయితే, చివరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎవరి అంచనాలను ఏ మేరకు నెరవేరుస్తారన్నది .. ఫిబ్రవరి 1న గానీ తెలియదు. కానీ, ఎంత కాదన్నా ఎన్నికల సంవత్సరంలో ప్రజాకర్షక పథకాల విషయంలో ఆర్థిక మంత్రి కట్టుబాట్లను కొంత మేర సడలించుకోక తప్పదని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.
అయినా ఎప్పటిలానే వడ్డింపులు ఉంటాయా? తాయిలాలు ప్రకటిస్తారా? మధ్య తరగతి ముచ్చట తీరుస్తారా? వేతన జీవులకు పన్నుపోటు నుంచి మరి కొంత ఉపశమనం కల్పిస్తారా? అనే చర్చ అయితే జోరుగానే సాగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి వేతన జీవుల ఈసారి బడ్జెట్‌లో పన్ను స్లాబ్‌లలో మరింత సడలింపును ఆశిస్తున్నారు. కొత్త పన్నులు వద్దమ్మా .. అని నిర్మలమ్మను కోరుకుంటున్నారు. కోవిడ్ కాలంలో ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఇబ్బంది పడుతున్న కార్మికవర్గం ఈసారి మోడీ ప్రభుత్వం పన్ను శ్లాబులలో మినహాయింపు ఇవ్వగలదని ఆశతో ఉన్నారు. కొత్తగా పన్నుల వడ్డన ఉండదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచన ప్రాయంగానే అయినా స్పష్టమైన సంకేతమే ఇచ్చారు. కానీ, శ్లాబులపై ఇంకా స్పష్టత రాలేదు. రాజకీయంగా ఒత్తిళ్ళు పెరుగతున్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం , ప్రస్తుత బడ్జెట్ ఎన్నికల బడ్జెట్ గానే వండి వారుస్తుందనే ఆశలు మాత్రం మధ్యతరగతి ప్రజల్లో మెండుగా ఉన్నాయి. అందుకే మధ్యతరగతి ఫిబ్రవరి 1 కోసం ఎదురుచుస్తున్నది.
అలాగే, నిరుద్యోగ యువత కొత్త బడ్జెట్‌లో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నది. కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి కల్పన కోసం చేపట్టబోయే కార్యక్రమాలపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కాలంలో లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఈ నేపధ్యంలో మధ్య తరగతి ప్రజల జీవనోపాధి అవకాశాలు కల్పనకు బడ్జెట్ దారి చూపుతుందని ఆశిస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య బీమా రంగం పుంజుకుంది. అయితే ఆరోగ్య బీమా విషయంలో ప్రభుత్వం నుంచి నిబంధనలలో కొంత సడలింపు ఉంటుందని అన్నివర్గాల ప్రజలు ఆశిస్తున్నారు. ఆరోగ్య బీమా, జీవిత బీమాలను జీఎస్టీ పరిధి నుంచి మినహాయించాలని కోరుతున్నారు. ఇలా మధ్య తరగతి కోర్కెల చిట్టా చాలానే వుంది. అయితే నిర్మలమ్మ ఏమంటారో.. ఎవరిని ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి మరి ..