జగన్ దృష్టిలో హోంమంత్రి కూడా చెల్లని కాణీయే!
posted on Jan 19, 2024 9:04AM
వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి వరుసపెట్టి పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, నియోజకవర్గం ఇన్‌చార్జిలను మార్చేస్తూనే ఉన్నారు. ఆ మార్పుల నాలుగో జాబితాను గురువారం(జనవరి 18) రాత్రి విడుదల చేశారు. ఆ జాబితాలో ముఖ్యంగా చెప్పుకోవలసిన అంశం ఏదైనా ఉంటే అది జగన్ కేబినెట్ లో హోంమంత్రిగా ఉన్న తానేటి వనితను నియోజకవర్గం మార్చేయడం.
కోవూరులో మీరు విజయం సాధించడం అసాధ్యం, మీపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంది అని చెబుతూ ఆమెను పశ్చిమ గోదావరి జిల్లా కోవూరు నుంచి గోపాలపురం నియోజకవర్గానికి మార్చేశారు. అలాగే గోపాలాపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావును కోవూరుకు మార్చారు. దీంతో వీరిరువురూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తలారి వెంకట్రావు గోపాలపురంలో తెలుగుదేశం పార్టీని దీటుగా ఎదుర్కోలేకపోతున్నారని భావించి మార్చేసినట్లు చెబుతున్నారు. తానేటి వనితను కోవూరు నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకత అంటూ మార్చేశారు. అంటే వీరిరువురి పెర్ఫార్మెన్స్ బాగాలేదనీ, ప్రజలలో ఆదరణ లేదనీ వారికి విస్పష్టంగా చెప్పేశారు. మరి తమతమ నియోజకవర్గాలలో ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటున్న వీరు పక్క నియోజకవర్గంలో ప్రజలను ఎలా ఆకట్టుకోలరన్న ప్రశ్నకు మాత్రం జగన్ నుంచి సమాధానం రావడం లేదు.
ఇక నాలుగో జాబితాలో శాసనసభ నియోజకవర్గాలకు జగన్ ఖరారు చేసిన ఇన్ చార్జిలు గోపాలాపురం- తానేటి వనిత (హోం మంత్రి), కొవ్వూరు (ఎస్సీ) - తలారి వెంకట్రావు, శింగనమల (ఎస్సీ- ఎం. వీరాంజనేయులు, మడకశిర (ఎస్సీ) -ఈర లక్కప్ప, కనిగిరి (ఎస్సీ) - దద్దాల్ నారాయణ మాదవ్, నందికొట్కూరు (ఎస్సీ) -సుధీర్ దార తిరువూరు (ఎస్సీ) -నల్లగట్ల స్వామిదాసు, జీడి నెల్లూరు (ఎస్సీ) -ఎన్. రెడెప్ప చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం (ఎస్సీ) -కే. నారాయణ స్వామి. ఇక ఈ జాబితా విడుదల తరువాత వైసీపీలో మరెన్ని వికెట్లు పడతాయో చూడాల్సిందేనని పరిశీలకులు అంటున్నారు.