అద్దంకి దయాకర్ కు అడ్డుపడుతున్నదెవరు?
posted on Jan 19, 2024 @ 9:33AM
ఓ మంత్రి అద్దంకి దయాకర్ కు అడ్డు పడ్డారనే ప్రచారం గాంధీభవన్‌లో జరుగుతోంది. 2018 ఎన్నికల్లో తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన దయాకర్ ను సొంత పార్టీ నేతలు ఓడించారంటూ దయాకర్ పలుమార్లు చెప్పారు. అయితే అప్పట్లో ఆయన సభా వేదిక ముందు ఓ నాయకుడిని దూషించారు. దీనిని మనసులో పెట్టుకున్న ఆ నాయకుడు గత ఎన్నికల్లో దయాకర్ కు టికెట్ రాకుండా చేశారని ప్రచారం జరుగుతున్నది. అయితే ఈసారి పార్టీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ దక్కుతుందని అందరూ భావించారు. రేవంత్ రెడ్డి కి అనుకూలమైన వ్యక్తిగా దయాకర్ ముద్రపడ్డారు. దయాకర్ కు ఎమ్మెల్సీ స్థానాన్ని దూరం చేయడం పట్ల ఆ కీలక నాయకుడి హస్తం ఉందని గాంధీభవన్ లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు తనకు ఎమ్మెల్సీ దూరమైనంత మాత్రాన తాను బాధపడటం లేదని అద్దంకి దయాకర్ తెలుగుఒన్‌తో చెప్పారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో వారు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వేరువేరుగా ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో.. అసెంబ్లీలో తగిన మెజారిటీ కలిగి ఉన్న అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలపై తీవ్రమైన కసరత్తు చేసింది. అయితే అప్పటిదాకా కేవలం అద్దంకి దయాకర్ పేరు మాత్రమే వినిపించింది. ఇక మిగతా ఎమ్మెల్సీకి ఎవరిని ఎంపిక చేస్తారు అనేది బయటకు పొక్కకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్త పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ లో వరల్డ్ ఎకానమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు వెళ్లే ముందు ఢిల్లీ లో కాంగ్రెస్ పార్టీ పెద్దలను కలిశారు. అప్పుడు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలని ప్రతిపాదించారు. దీనికి అధిష్టానం కూడా పచ్చ జెండా ఊపింది. అయితే ఆ తర్వాత అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ వర్గీయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. వారి వారి సామాజిక వర్గాల చెందినవారు దయాకర్, బల్మూరి వెంకట్ కు అభినందనలు తెలిపారు. అయితే ముఖ్యమంత్రి దావోస్ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా ఢిల్లీలో సీన్ మారిపోయింది. చివరి నిమిషంలో అద్దంకి దయాకర్ పేరు గల్లంతయింది. ఆయనకు బదులు మహేష్ కుమార్ గౌడ్ పేరు వచ్చి చేరింది. అయితే ఈ వివరాలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా అద్దంకి దయాకర్ కు.. ఆయనకు మద్దతు ఇచ్చిన ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు దెబ్బకు సైలెంట్ అయిపోయాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన అద్దంకి దయాకర్ ను ఢిల్లీ పెద్దలు ఝలక్ ఇచ్చారు. గతంలోకి తొంగి చూస్తే అప్పట్లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా కేవీపి రాంచంద్రరావుకు రాజ్యసభకు పంపాలనుకున్నప్పుడు కూడా ఇలాగా ఢిల్లీ పెద్దలు అడ్డుకున్నారంటూ గాంధీభవన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.