ముఖ్యమంత్రి కి సుప్రీం ‘ఛీ’వాట్లు
posted on Mar 25, 2021 @ 2:28PM
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, సుప్రీం కోర్టు న్యాయమూర్తి, జస్టిస్ ఎన్వీ రమణ పై చేసిన ఫిర్యాదును, సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి, గత సంవత్సరం అక్టోబర్ 6 వ తేదీన, జస్టిస్ ఎన్వీ రమణతో పాటుగా, ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు న్యాయమూర్తుల పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎబాబ్డేకు ఫిర్యాదు చేశారు. అందులో జగన్మోహన రెడ్డి, జస్టిస్ రమణ కుటుంబ సభ్యులు అమరావతి భూములకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారని, అదే విధంగా రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చేలా జస్టిస్ ఎన్వీ రమణ వారిని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.
జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదును అంతర్గత నిబంధనల ప్రకారం సమూలంగా పరీక్షించిన న్యాయస్థానం, ఫిర్యాదును కొట్టివేసిందని సుప్రీం కోర్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. జగన్మోహన్ రెడ్డి తమ ఫిర్యాదులో జస్టిస్ ఎన్వీ రమణ ఇతర న్యాయమూర్తులపై చేసిన ఆరోపణలు, పూర్తిగా నిరాధారమైననవి, అల్పమైనవి, తుచ్చమైనవి, అసత్యమైనవి న్యాయస్థానం చాలా తీవ్రంగా ముఖ్యమంత్రి దురుద్దేశాలను ఎండగట్టింది. అంతేకాదు, జగన్మోహన రెడ్డి న్యాయవ్యవస్థను బెదిరించేందుకు ఉద్దేశపూర్వకంగా నిరాధారమైన ఆరోపణలు చేశారని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.
న్యాయవ్యవస్థను బెదిరించే ప్రయత్నం చేయడమంటే సామాన్య మైన విషయం కాదు. అదీకాక, జస్టిస్ రమణ పై జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదుకున్న నేపధ్యాన్ని గమనిస్తే, అనేక అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నఆయన, ఎదో తెలియని భయంతో ఆరోపణలు చేశారన్న అభిప్రాయం సహజంగానే ఎవరికైనా కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డిపై ఇంచుమించుగా ఓ డజన్ వరకు క్రిమినల్ కేసులు, సిబిఐ, ఈడీ విచారణలో ఉన్నాయి. ఆయన జైలు జీవితం అనుభవించారు. అయన ఆస్తులను జప్తు చేయడం జరిగింది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. మరోవంక జగన్మోహన్ రెడ్డి ఫిర్యాదుకు కొద్ది రోజుల ముందు, జస్టిస్ ఎన్వీ రమణ సారధ్యంలోని ధర్మాసనం, న్యాయవ్యవస్థ పట్ల ప్రజలలో విశ్వాసం పెంచేందుకు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు ఇతర ప్రజాప్రతినిధులపై సుదీర్ఘకాలంగా పెండింగ్’లో ఉన్న క్రిమినల్ కేసుల విచారణను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. జస్టిస్ ఎన్వీ రమణ అదేశాలే, జగన్ రెడ్డి, ఫిర్యాదుకు మూలకారణమని చాలామంది భావిస్తున్నారు. అలాగే, న్యాయమూర్తి కాకముందు, న్యాయవాదిగా ఎన్వీ రమణకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగా చంద్రబాబుతో తమకున్న వైరం కారణంగాను జస్టిస్ రమణపై జగన్ రెడ్డి ఫిర్యాదు చేసి ఉండవచ్చునని అంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఎందుకు ఫిర్యాదు చేశారన్నది కాదు.ప్రధాన న్యాయమూర్తి ప్రకటన ప్రకారం న్యాయవ్యవస్థను భయపెట్టే ఉద్దేశంతో న్యాయమూర్తులపై, ప్రధాన న్యాయమూర్తి కానున్న జస్టిస్ ఎన్వీ రమణ పై నిరాధారమైన ఆరోపణలు చేసిన వ్యక్తిపై సర్వోనంత నాయస్థానం ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేది, అనేకమందికి కలుగు తున్న అనుమానం.ఫిర్యాదు చేసిన వ్యక్తి కీలక పదివిలో ఉన్నారు. ఆయన ఫిర్యాదు చేసింది సమాన్య వ్యక్తి పై కాదు. కొద్ది రోజుల్లో భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టన్నున్న న్యాయమూర్తి పై ఆయన అసాధారణ రీతిలో ఫిర్యాదు చేశారు. అయన చేసిన ఫిర్యదు దురుద్దేశ పూరితం అయినప్పుడు న్యాయస్థానం చర్యలు తీసుకుంటుంది ఎవరైనా భావిస్తారు. అలాంటిది ఏమీ లేక పోతే, సామాన్యులకు చాలా సందేహలు కలుగుతాయి.
అలాగే, అనేక క్రిమినల్ కేసులు ఎదుర్కుంటూ, ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి, న్యాయవ్యవస్థపై చేసిన ఫిర్యాదు, పూర్తిగా అసత్యం, నిరాధారం, అన్నిట్నీ మించి ఉద్దేసపూర్వకంగా చేసిన ఫిర్యాదుగా సర్వోన్నత న్యాయస్థానం నిరూపించిన తర్వాత అయిన ఏమి చేయాలి? కనీసం న్యాయస్థానానికి బహిరంగ క్షమాపణలు చెప్పాలి, తప్పోప్పుకుని, పదవికి రాజీనామ చేయాలి... కానీ, నవ్విపోదురు గాక నాకేటి సిగ్గను కుని తుడిచేసుకుపోతే.. అది ఆయనకేమో కానీ, ఆయన పదవికి మాత్రం అవమానం.