పులివెందులలో హై టెన్షన్.. ఒక వైపు అవినాష్..మరో వైపు సీబీఐ
posted on Apr 26, 2023 @ 12:26PM
అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యం అని తేలిపోయిన తరువాత పులివెందులలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడంతో ఇహనో ఇప్పుడో అవినాష్ అరెస్టు ఖాయమన్న విషయంపై పెద్ద ఎత్తున పులివెందులలోనే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య కడప ఎంపీ అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి పులివెందులకు చేరుకున్నారు.
అయితే సీబీఐ అధికారులు అంతకు ముందు రోజు నుంచే పెలివెందులలో మకాం వేశారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందా అన్న టెన్షన్ పులివెందులలో నెలకొని ఉంది. ఎంపీ అవినాష్ రెడ్డి కోసం ఆయన మద్దతు దారులు, అనుచరులు భారీగా తరలి రావడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ టెన్షన్ వాతావరణంలోనే అవినాష్ రెడ్డి పులివెందులలో ప్రజాదర్బార్ నిర్వహించారు. సీబీఐ అరెస్ట్ చేస్తే ఎలాంటి వ్యూహం అవలంబించాలన్న విషయంపై తన అనుచరులతో అవినాష్ రెడ్డి చర్చలు జరిపారని అంటున్నారు.
అదలా ఉంచితే.. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి భద్రత విషయంలో సీబీఐ అధికారులకు అనుమానాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. దస్తగిరి ఇంటికి వెళ్లిన సీబీఐ అధికారులు ఆయనను జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచించారు. దీంతో దస్తగిరి భద్రత విషయంలో సీబీఐ అధికారులు చేతులెత్తేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్నపిటిషన్ పై తెలంగాణ హైకోర్టు బుధవారం (ఏప్రిల్ 26)విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి పులివెందులలో ఉండటంతో కేసు విచారణ ఈ రోజు విచారణకు వస్తుందా అన్న అనుమానాలూ వ్యక్తమౌతున్నాయి.
అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఉన్న అన్ని దారులూ మూసుకుపోవడంతో అవినాష్ రెడ్డి ఏం చేస్తారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో అనుచరులు, మద్దతుదారులతో అవినాష్ వరుస భేటీలు నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా పులివెందులతో పాటు కడప జిల్లా వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది.