సమగ్ర పంటలబీమా తక్షణావసరం!
posted on Apr 26, 2023 @ 12:50PM
పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షంతో అన్నదాతల నెత్తిన పిడుగుపడింది. పెట్టిన పెట్టుబ డులు వర్షార్పణం అయ్యాయి. పంటలు వస్తే అప్పులు తీర్చుకుని కొత్త పంటలు వేద్దామన్న ఆశతో ఉన్న అన్నదాతను అకాల వర్షం దొంగ దెబ్బతీసింది. ఈ నెలలోనే వరుసగా మూడు మార్లు అకాల వర్షం అన్నదాతపై కోలుకోలేని దెబ్బ తీసింది. ఉభయ తెలుగు రాష్టాల్లోనూ ఇదే పరిస్థితి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. చేతికొచ్చే సమయంలో నీళ్లపాలవుతుండం ఒక రివాజుగా మారిపోయింది.
నష్టాల అంచనాలతో కాలక్షేపం చేయకుండా... కాలయాపన జరక్కుండా అన్నదాతను ఆదుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాల వారీగా, గ్రామాల వారీగా పంట నష్టాలను గుర్తించాలి. రైతులకు భరోసా ఇవ్వాలి. మొక్కజొన్న, వరి, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే పంట నష్టం జరిగింది. తెలంగాణలో ఇటీవలే దెబ్బతిన్న పంటలను సిఎం కెసిఆర్ పరిశీలించారు. కేంద్రం ఇచ్చే సాయం కోసం ఎదురుచూడకుండా ఎకరాకు పదివేల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ సాయమే ఇంతవరకు అందలేదు.
ఈ క్రమంలో ఇంకా ఆలస్యం చేయ
కుండా వెంటనే అన్నదాతను ఆర్థికంగా ఆదుకోవాలి. ఇప్పటికైనా సమగ్ర పంటల బీమా ను కూడా వన్ నేషన్ వన్ క్రాప్ ఇన్సూరెన్స్ పద్ధతికి మార్చాలి. దేశంలో ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చించి సమగ్ర పంటలబీమా పథకం రచించాలి. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వాలతో ప్రమేయం లేకుండా సాయం అందేలా చూడాల్సిన అవరసరం ఉంది. అప్పుడు ప్రభుత్వాలు మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకోగలుగుతాయి.