కమలం గూటికి సమంత?
posted on Sep 5, 2022 @ 10:36AM
హీరోయిన్ సమంత కు సంబంధించి ఏ వార్త వచ్చినా అది సంచలనమే. అక్కినేని నాగచైతన్యతో విడాకుల అనంతరం ఆమె సినీ కెరీర్ రేసు గుర్రంలా పరుగెడుతోందని చెప్పాలి. వరుస సినిమాలతో సందడి చేస్తున్న సమంత ఇప్పుడు రాజకీయాల వైపు దృష్టి సారించిందని అంటున్నారు.
ప్రస్తుతం ఆమె నటించిన రెండు సినిమాలు విడుదలకు సద్ధంగా ఉన్నాయి. యశోద, శాకుంతలం సినిమాలపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ప్రస్తుతం ఆమె నటిస్తున్న రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. సామాజిక మాధ్యమంలో యాక్టివ్ గా ఉండే సమంత గత కొన్ని రోజులుగా కొత్తగా ఎటువంటి పోస్టులూ చేయడం లేదు. కారణమేమిటా అని అభిమానులు పలు ఊహాగాన సభలు చేస్తున్నారు.
ఒక హాలీవుడ్ సినిమాలో కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సమంత.. ఇంత బిజీలో కూడా రాజకీయాలవైపు దృష్టి సారించిందని అంటున్నారు. ఈ వార్తలకు కారణం ఆమె స్వయంగా తాను మేడీకి పెద్ద ఫాన్ నని చెప్పడమే కాకుండా ఆయనకు ఎప్పటికీ సపోర్టర్ గా ఉంటానని మీడియా ముందే చెప్పారు. దీంతో నెటిజన్లు ఆమె త్వరలో కమలం గూటికి చేరనున్నారని అంటున్నారు. పరిశీలకులు కూడా బీజేపీ పెద్దలు త్వరలో ఆమెను అప్రోచ్ అవుతారనీ, బీజేపీలోకి ఆహ్వానిస్తారని చెప్పారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ సినీ గ్లామర్ ను పార్టీలోనికి తీసుకురావడానికి అత్యంత ఉత్సాహం చూపుతున్న సంగతి విదితమే.
ఇటీవల అమిత్ షా హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నసంగతి విదితమే. జూనియర్ ఎన్టీఆర్ కమలం గూటికి చేరడంపై ఎన్నో వదంతులు ప్రచారంలోకి వచ్చినా అవేవీ వాస్తవరూపం దాల్చలేదు. అయితే ఆ తరువాత సినీనటుడు నితిన్ ను బీజేపీ సంప్రదించింది. నితిన్ వచ్చే ఎన్నికలలో బీజేపీ తరఫున ప్రచారం చేసే అవకాశం ఉందని బీజేపీ శ్రేణులే చెబుతున్నాయి. అలాగే మరి కొందరు సినీ నటులు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
అయితే అనూహ్యంగా సమంత కమలం గూటికి చేరుతుందంటూ వార్తలు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తనుండటం మాత్రం ఆసక్తి కలిగిస్తోంది. కెరీర్ పీక్ లో ఉండగా సమంత ఇటువంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవని ఆమె అభిమానులు అంటుండగా.. కేరీర్, రాజకీయాలూ రెంటినీ సమన్వయం చేసుకోగలిగే సామర్థత సమంతలో మెండుగా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద సమంత బీజేపీ గూటికి చేరనున్నట్లుగా వస్తున్న వార్తలలో వాస్తవం సంగతి పక్కన పెడితే.. ఈ వార్త మాత్రం అటు సినీ వర్గాలలో, ఇటు రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.