ఇక సుప్రీం విచారణలు ప్రత్యక్ష ప్రసారం
posted on Sep 21, 2022 @ 2:41PM
ఇక కోర్టు సీన్లు సినిమాల్లోనూ, టీవీ సీరియల్స్ లోనే కాదు, ప్రత్యక్షంగానూ చూడ వచ్చును. అవును, సుప్రీం కోర్టులో విచార జరగే సమయంలోనే, వాద ప్రతివాదనలతో పాటుగా న్యాయమూర్తులు ఇచ్చేతీర్పులు, ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం త్వరలో రాబోతోంది. ఈ మేరకు భారత సర్వోన్నత న్యాయస్థానం, సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
సుప్రీం కోర్టులో కీలక విచారణలను ఇకపై ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం అందరికీ కలిపించాలని నిర్ణయించింది. ఇంత వరకు పార్లమెంట్,అసెంబ్లీ సమావేశాలు, టీవీ చర్చా కార్యక్రమాలు, రాజకీయ సభలు, సమావేశాలకు ఇతరత్రా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న విధంగానే, ఇకపై, సుప్రీంకోర్టులో కీలక విచారణలకు సంబంధించి వాద ప్రతివాదనలను ప్రజలంతా ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించనుంది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ యు.యు. లలిత్ ఆధ్వర్యంలో జరిగినమంగళవారం (సెప్టెంబర్ 20) జరిగిన ఫుల్ కోర్ట్ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
సెప్టెంబరు 27 నుంచి రాజ్యాంగ ధర్మాసన విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ నిర్ణయంతో పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 వంటి కీలక కేసులకు సంబంధించిన విచారణలను దేశ ప్రజలంతా ప్రత్యక్షంగా చూడొచ్చు. నిజానికి, కేసుల విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి అనుకూలంగా సుప్రీంకోర్టు 2018లోనే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆచరణలోకి రాలేదు. ఈనేపధ్యంలో సర్వోన్నత న్యాయస్థానం విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ సహా పలువురు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అప్పట్లో కోర్టు సానుకూలంగా ఉత్తర్వులు వెలువరించింది.
కానీ, దాన్ని అమలు చేయడంలో జాప్యం జరిగింది. తాజాగా వచ్చేవారం నుంచి లైవ్ స్ట్రీమింగ్‌ను ఆచరణలో పెట్టనున్నారు. తొలుత రాజ్యాంగ ధర్మాసన విచారణలను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. ఆ తర్వాత అన్ని ధర్మాసనాల విచారణలను కవర్ చేయనున్నారు. ప్రస్తుతానికి కొన్ని రోజుల పాటు యూట్యూబ్‌లో వీటిని టెలికాస్ట్ చేయాలని నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రత్యక్ష ప్రసారాల కోసం త్వరలోనే సుప్రీంకోర్టు సొంత ప్లాట్‌ఫామ్‌ను తయారుచేసుకోనుందని తెలిపాయి.
అయితే, ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్.వి. రమణ పదవీ విరమణను పురస్కరించుకుని ఆగస్టు 26న ప్రత్యేకంగా సమావేశమైన సెరిమోనియల్ ధర్మాసనం కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారంతో, జస్టిస్ రమణ న్యాయస్థానాల కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పడు, మరో అడుగు ముందుకుపడింది. ముందు ముందు, అన్ని కోర్టుల విచారణలు ప్రత్యక్ష ప్రసారం అయినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఇలా ప్రత్యక్ష ప్రసారం చేయడం వలన ప్రజలకు ఫస్ట్ హ్యాండ్ సమాచారం అందుబాటులోకి రావడమే కాకుండా పారదర్శకత పెరుగుతుంది.