తెలంగాణలో సోమేష్ కథ ముగిసినట్టేనా?
posted on Jul 8, 2022 @ 10:46AM
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కథ ఇక తెలంగాణలో ముగిసినట్లేనా? తాజాగా కేంద్రం సోమేష్ కుమార్ ను ఏపీకి పంపాల్సిందే అని స్పష్టం చేస్తే ఆయన ఇక ఏపీకి వెళ్లక తప్పదనే అనుకోవాలి. అయితే..కేంద్రం ఒక ఆప్షన్ ఇచ్చింది. సోమేష్ కుమార్ తెలంగాణలో ఉండటం అత్యవసరమని భావిస్తే ఏపీని ఒప్పింది తిరిగి డెప్యూటేషన్ మీద తెచ్చుకోవచ్చని పేర్కొంది.
సమర్ధవంతమైన అధికారిగా ప్రభుత్వం గుర్తింపు పొందిన సోమేష్ కుమార్ ఇక మీదట ఆ పోస్టులో కొనసాగడం సాధ్యమయ్యే పనిలా కనిపించడం లేదు. సోమేష్ కుమార్ ను ఏపీ క్యాడర్ కు బదలాయిస్తూ కేంద్రం నిర్ణయించడాన్ని వ్యతిరేకించిన కేసీఆర్ సర్కార్ సోమేష్ కుమార్ తో క్యాట్ లో పిటిషన్ వేయించింది. ఏపీకి అలాట్ అయిన మీరు తెలంగాణలో కనసాగుతాననడాన్ని ఎలా సమర్ధించుకుంటారంటూ క్యాట్ ఆయనను ప్రశ్నించింది. అదే సమయంలో సోమేష్ కుమార్ ను తెలంగాణలో కొనసాగించడం కుదరదని క్యాట్ కు కేంద్రం స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో క్యాట్ తీర్పు రాగానే సోమేశ్ ఏపీకి తరలివెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. ఇలా ఉండగా సోమేష్ కుమార్ తెలంగాణలో కొనసాగడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం విచారణ జరిగింది. కేంద్రం తరఫున ఏఎస్జీ టి. సూర్యకరణ్ రెడ్డి వాదనలు వినిపించారు.
సోమేశ్‌కుమార్ ఏపీకి వెళ్లాల్సిందేనని, కావాలనుకుంటే అక్కడి నుంచి డిప్యుటేషన్ మీద తెలంగాణ ప్రభుత్వం ఆయనను తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కేసుపై క్యాట్‌లో విచారణ సందర్భంగా ఐఏఎస్, ఐపీఎస్ కేటాయింపులపై నిర్ణయాధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందంటూ రాష్ట్ర ప్రభుత్వం వాదించిందని గుర్తుచేశారు. ఇరు వైపు వాదనలూ విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.