తెలుగు రాష్ట్రాలకు తొలగని వరుణ గండం
posted on Jul 22, 2023 @ 11:39AM
తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. పలు గ్రామాల్లో లో లెవల్ వంతెనలపై వరదనీరు పొంగి పోర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నదులన్నీ ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా ప్రాజెక్టుల్లోకి ఎగువ నుంచి పెద్దమొత్తంలో వరద పొటెత్తుతున్న కారణంగా ఆ ప్రాజెక్టుల పరిస్థితి టెన్షన్‌గా మారుతోంది. అయితే గోదావరి నది మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. ఇంతలోనే మళ్లీ వర్ష సూచన. కాగా.. ఇప్పుడు కురుస్తున్న వర్షాలకు కారణం క్యుములోనింబస్ మేఘాలు. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో పాటు చాలా ఫాస్ట్‌గా కదులుతూ ఉంటాయి. వీటి వల్ల ఇంకో ఇబ్బంది ఏంటంటే.. ఉరుములు, మెరుపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. పిడుగు పాటుకు అవకాశం ఎక్కువ. దీంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలోనే భారత వాతావరణ విభాగం మరో పిడుగులాంటి వార్తను అందించింది. తెలుగు రాష్ట్రాలకు హై అలెర్ట్ ప్రకటించింది. నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ నెల 24న మరో అల్ప పీడనం పొంచి ఉందని తెలిపింది. రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ జారీ చేసిన అలెర్ట్ లకు సంబంధించి అవగాహనా చాలామందికి ఉండదు.
ప్రస్తుతానికి ఆరెంజ్, రెడ్, యెల్లో, గ్రీన్ అలర్ట్ లను వాతావరణ శాఖ జారీ చేస్తోంది. ఈ అలర్ట్ లను 1875వ సంవత్సరంలో బ్రిటీష్ పాలకులు తొలుత జారీ చేశారు.ఇలాంటి సూచనలు బట్టే ప్రజలు అప్రమత్తమవుతారు.
ఎల్లో అలర్ట్ అంటే...
ఈ రంగు వాతావరణాన్ని 'చూడండి' అని చెబుతుంది మరియు నిర్వాహకులను 'అప్‌డేట్ అవ్వండి' అని పిలుస్తుంది. ఇది వాతావరణ మార్పులతో ముడిపడి ఉంది, ఇది ప్రస్తుతం తక్కువ హానిని కలిగిస్తుంది కానీ ప్రభావం కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఉరుములు, భారీ వర్షాలు, బలమైన గాలులు, వేడి లేదా శీతల అలలు, మరియు సముద్రపు విపత్కర పరిస్థితులు వంటి అంశాలు హెచ్చరికకు దారితీస్తాయి.
ఆరెంజ్ అలెర్ట్
ఇది చాలా భారీ వర్షపాతం, తీవ్రమైన వేడి లేదా చలిగాలులు లేదా ప్రభావవంతమైన తుఫాను వచ్చినప్పుడు ఇటువంటి హెచ్చరికలు జారీ చేయబడతాయి. ప్రజలు తమను తాము రక్షించుకోవడానికి సిద్ధంగా ఉండాలి. వారి ప్రాంతం ఈ హెచ్చరిక కేటగిరీ కిందకు వస్తే బయటకు వెళ్లే ముందు బాగా ప్లాన్ చేసుకోవాలి.
రెడ్ అలర్ట్ అంటే...
రెడ్ అలెర్ట్ అనగానే జాగ్రత్తగా ఉండండి అని అర్థం. లేదా సంసిద్దంగా ఉండండి అని అర్థం.
గ్రీన్ అలెర్ట్ అంటే..
ఇది 'హెచ్చరిక లేదు'ని సూచిస్తుంది ఎటువంటి 'చర్య అవసరం లేదు' అని అర్థం. రోజులు ఆహ్లాదకరంగా గడుస్తాయి. ఈ ప్రాంతంలోన రోజువారీ జీవితంలో వాతావరణ ప్రభావం చాలా తక్కువ ఉంటుంది.
హైదరాబాద్ లో మరో ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనూ వర్షానికి అవకాశముందని, ఈ మూడు జిల్లాల ప్రజలు ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఏవైనా సమస్యలు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ 040-21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. జలమండలి తాగునీటి సరఫరా, నాణ్యతపై దృష్టి సారించింది. నగరంలో దాదాపు 16 ఈఆర్టీ బృందాలను జలమండలి ఏర్పాటు చేసింది. నీరు నిలిచిన ప్రాంతంలో వాటిని తొలగించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనాల్లో జనరేటర్ తో కూడిన డీ వాటర్ మోటార్ ఉంటుంది.
మరో రెండు రోజుల్లో అల్పపీడనం పొంచి ఉండటంతో తెలంగాణా సర్కార్ అప్రమత్తమైంది. అధికారులకు మంత్రి తలసాని ఆదేశాలు జారీ చేశారు. నాలుగు రోజుల వర్షాలకే ఉభయ రాష్ట్రాలు అతలాకుతలం కావడంతో పాలకులు మరింత అప్రమత్తమయ్యారు.
హుస్సేన్ సాగర్ కు భారీ వరద నీరు వస్తోందని, ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలన్నారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలన్నారు.
భారీ వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ నిండు కుండలా మారింది. నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవల్ ను దాటింది. ఫుల్ ట్యాంక్ లెవల్ సామర్థ్యం 513.45 మీటర్లు కాగా, 514.75 మీటర్లను దాటింది. దీంతో దిగువకు నీరు విడుదల చేస్తున్నారు.