ఏపీలో కుండపోత వానలు... గోదావరి ఉగ్రరూపం
posted on Aug 27, 2025 @ 7:33PM
ఏపీలో కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో అధికారులు అలర్ట్ అయి.. ప్రజలకు ఇబ్బందులు కాకుండా చర్యలు చేపడుతున్నారు. వాతావరణ శాఖ మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికలతో అధికారులు ముమ్మరంగా సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యారు. వరదలు పోటెత్తే ప్రాంతాల్లో ఇప్పటికే రెస్క్యూ సిబ్బందిని మోహరించారు. ఇక కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి.. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు
.ఒడిశా తీరానికి ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని.. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఒడిశా వైపు నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అల్పపీడన ప్రభావంతో రేపు(గురువారం) ఏపీలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వివరించారు.
మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. గోదావరి నదిలో అంతకంతకూ వరద పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఏలూరు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు.. భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వరదలకు సంబంధించి సమాచారాన్ని, పరిస్థితిని పరీవాహక ప్రజలకు అందించాలని తెలిపారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ హెల్ప్‌లైన్ నంబర్ 91549 70454 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.