ప్రతిరోజూ లెమన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే..!
posted on Jul 25, 2025 @ 9:30AM
భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఉదయాన్నే పనులు చురుగ్గా మొదలుపెట్టాలన్నా, సాయంత్రం అలసట నుండి బయటపడాలన్నా టీ ఉండాల్సిందే.. అయితే రోజూ తాగే టీలో పాలు కలపడకుండా అందులో కాస్త నిమ్మరసం జోడిస్తే చాలా షాకింగ్ రిజల్ట్ ఉంటాయని అంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. దీన్నే లెమన్ టీ అంటారు. రోజూ ఒక కప్పు లెమన్ టీ తాగడం మొదలుపెడితే ఒకటి, రెండు కాదు అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చట. ఇంతకూ లెమన్ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుంటే..
రోగనిరోధక శక్తి.. హైడ్రేషన్..
లెమన్ టీ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. నిమ్మకాయ విటమిన్ సి కి అద్భుతమైన మూలం. ఇది ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడానికి అవసరం.
లెమన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది. దీనితో పాటు, లెమన్ టీ సహజ నిర్విషీకరణ కారకంగా పనిచేస్తుంది. ఇది శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో, కాలేయం, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరాన్ని లోపలి నుండి శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.
జీర్ణక్రియ, బరువు..
ఎక్కువగా జీర్ణ సమస్యలు ఎదుర్కునేవారు లెమన్ టీ తీసుకుంటే చాలా మంచిది. లెమన్ టీ జీర్ణ సమస్యలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే ఆమ్ల లక్షణాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఆహారాన్ని జీర్ణం చేయడాన్ని సులభతరం చేస్తాయి. ఇది ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
కేవలం జీర్ణ సమస్యలకు మాత్రమే కాదు.. లెమన్ టీ బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. నిమ్మకాయ జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని లెమన్ టీ తాగడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును కాల్చే ప్రక్రియ వేగవంతం అవుతుంది. కడుపు నిండిన ఫీలింగ్ ఇస్తుంది. దీని వల్ల అనవసరమైన ఆకలిని కూడా నియంత్రించవచ్చు.
చర్మం..
లెమన్ టీ అంతర్గత ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని అకాల వృద్ధాప్యం, ముడతలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం క్లియర్ గా , ప్రకాశవంతంగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
మొటిమలు, మచ్చలు..
మొటిమలు, మచ్చలను తగ్గించడంలో కూడా లెమన్ టీ సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. నిమ్మకాయ వాసన, వేడిగా ఉండే లెమన్ టీ శరీరానికి రిలాక్స్ ఇస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
గుండె ఆరోగ్యం..
లెమన్ టీలో లభించే పాలీఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అవి రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తపోటును నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు.. నిమ్మకాయలో నోటి ఆరోగ్యానికి ప్రయోజనకరమైన యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇది నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడం ద్వారా దుర్వాసనను తగ్గించడానికి, చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే రోజుకు 2 నుండి 3 కప్పుల కంటే ఎక్కువ లెమన్ టీ తాగకూడదు.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..