స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ లోపు రంగులు తొలగించాలి
posted on Apr 20, 2020 @ 4:34PM
*పంచాయితీ కార్యాలయాలకు వై సి పి రంగులపై హైకోర్టు ఆదేశం
*రంగుల తొలగింపునకు 3 వారాల గడువు ఇచ్చిన హై కోర్ట్
మొత్తానికి ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. పంచాయతీ కార్యాలయాలకు రంగుల విషయం లో హైకోర్టు చెప్పినట్టే చేస్తానని మాట ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ లోపు రంగుల తొలగింపు పూర్తి చేయాలని ఈ రోజు హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాస్తవానికి జనవరి 27 వ తేదీనే, జగన్ సర్కార్‌కు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. పంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానివని, వాటికి పార్టీ రంగులు ఉండకూదని హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున ఇప్పుడున్న వైసీపీ రంగులను తొలగించాలని సూచించింది. గుంటూరు జిల్లాలో పంచాయతీ కార్యాలయానికి వైసీపీ రంగు వేశారంటూ శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
పంచాయతీ కార్యాలయాలు ప్రభుత్వానికి చెందినవని.. ప్రభుత్వ ఆస్తులపై ఎలాంటి పార్టీ రంగులూ ఉండకూడదని ఆదేశించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ వ్యవహారంలో బాధ్యత తీసుకోవాలని, కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు జనవరి 27 వ తేదీనే ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత, రెండు వాయిదాలు తీసుకుంది. ఈ రోజు ఫైనల్ గా హై కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.