ఈసీ బదలీలలేనా?
posted on Oct 12, 2023 @ 12:10PM
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇలా ప్రకటించిందో లేదో అలా కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో ఎన్నికల బదలీల ప్రక్రియ ప్రారంభించేసింది. సాధారణంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తరువాత కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల విధులలో బాధ్యతలు నిర్వహించే శాఖలను, యంత్రాంగాన్ని తన అధీనంలోకి తీసుకుంటుంది. కానీ తెలంగాణ విషయంలో మాత్రం ఒక అడుగు ముందే ఉంది. ఇలా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయగానే అలా యంత్రాంగాన్ని తన అధీనంలోకి తీసుకోవడం ప్రారంభించింది. కీలక అధికారుల బదలీ చేసేసింది.
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి ఎన్నికలలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? అన్నదానితో సంబంధం లేకుండా ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. ఉండాలి కూడా. అయితే కేంద్రంలో మోడీ నాయకత్వంలోని సర్కార్ కొలువు దీరిన నాటి నుంచి ఆ పరిస్థితి లేకుండా పోయింది. వ్యవస్థలు స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేకుండా పోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలపై ప్రజలలో ఎలా అయితే విశ్వసనీయత లేకుండా పోయిందో.. కేంద్ర ఎన్నికల సంఘంపై కూడా అలాంటి అనుమానాలే వ్యక్తం అవుతున్నాయి. 2014లో కేంద్రంలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే కూటమి సర్కర్ ఏర్పాటైంది. అప్పటి నుంచీ క్రమక్రమంగా కేంద్రం వ్యవస్థలపై ఆధిపత్యం సాధించే విధంగా పావులు కదుపుతూ వచ్చిందని అంటున్నారు. అధికారుల నియామకం నుంచి, బదలీల వరకూ అస్మదీయులకు పెద్ద పీట వేయడం మొదలైందని సోదాహరణంగా వివరిస్తున్నారు. అన్నిటికీ మించి అత్యంత కీలక స్థానాలలో ఉన్న వారిలో అత్యథికులు ప్రధాని మోడీ స్వంత రాష్ట్రమైన గుజరాత్ కు చెందిన వారే కొలువుదీరి ఉండడాన్ని చూపుతున్నారు.
ఇక 2019 ఎన్నికలకు ముందు.. అంతకు ముందు వరకూ ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పక్షమైన తెలుగుదేశం ఆ కూటమి నుంచి బయటకు వచ్చింద. విభజన హామీలు నెరవేర్చే విషయంలో, మరీ ముఖ్యంగా రెవెన్యూలోటుతో బీద రాష్ట్రంగా మిగిలిన ఏపీకి అందించాల్సిన సహకారం విషయంలో మోడీ సర్కార్ వైఖరితో విబేదించిన చంద్రబాబు.. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చారు. ఫలితం.. 2019 ఎన్నికలలో కేంద్రంలోని మోడీ సర్కార్ ఆయనను చక్రబంధం చేసేసిందని పరిశీలకులు అప్పట్లో విశ్లేషించారు.
2019లో ఎన్నికల కోడ్ రాగానే కేంద్ర ఎన్నికల సంఘం ఏపీపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. సీఎస్ సహా కీలక నేతలందరినీ బదలీ చేసేసింది. ఏ అధికారీ కూడా చంద్రబాబు మాట వినని పరిస్థితిని క్రియోట్ చేసింది. చివరాఖరికి అప్పట్లో కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం తన స్థాయిని కూడా పట్టించుకోకుండా డీజీపీ కార్యాలయానికి వెళ్లి పరిస్థితిని పర్యవేక్షించారంటే బాబు ఓటమే లక్ష్యంగా బదలీలు, నియామకాలు ఎలా జరిగాయో అర్ధం అవుతుంది.
అప్పట్లో పరిస్థితి అలా మారడానికి చంద్రబాబు మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ తో విభేదించడమే కారణమని అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. ఇప్పుడు మోడీతో విభేదించిన తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే పరిస్థితిని ఎదుర్కొనే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఇలా షెడ్యూల్ విడుదల కాగానే అలా కీలక అధికారులను ఎన్నికల సంఘం బదలీ చేయడమే నిదర్శనం అంటున్నారు. సాధారణంగా అధికారుల అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు వస్తే కేంద్ర ఎన్నికల సంఘం వాటిని పరిశీలించి బదలీ చేస్తుంది. కానీ 2019 ఎన్నికల సమయంలో ఏపీలోనూ, ఇప్పుడు 2023 తెలంగాణ ఎన్నికల సమయంలో తెలంగాణలోనూ కేంద్ర ఎన్నికల సంఘం ఫిర్యాదులతో సంబంధం లేకుండానే.. బదలీలు చేసేసింది. తెలంగాణలో అయితే షెడ్యూల్ ప్రకటనకు ముందే ఎవరెవరిని బదిలీ చేయాలీ, ఎవరెవరిని ఎన్నికల విధుల్లో ఉండేలా చేయాలి అన్న జాబితారెడీ చేసుకుని కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యేలా తాజా బదలీలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.
నోటిఫికేషన్ విడుదల నాటికి మరిన్ని బదలీలు ఉంటాయన్న అంచనాలూ ఉన్నాయి. కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు యంత్రాంగం నుంచి ఎటువంటి సహాయ సహకారాలూ అందకుండా చేయడమనే లక్ష్యంతో ఈ బదలీల పర్వం ఉందన్న విమర్శలు అయితే ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎన్నికల సమయంలో అధికార పార్టీకి యంత్రాంగం నుంచి సహాయ సహకారాలు అందకూడదనీ కీలక శాఖల ఉద్యోగులందరినీ ఎన్నికల సంఘం అధీనంలోకి తీసుకుంటుంది. అయితే ఈ విషయంలో పైస్థాయి రాజకీయ ఒత్తిడుల కారణంగా రాజకీయంగా ఎవరికో లబ్థి చేకూర్చాలన్నట్లుగా బదలీలు ఉన్నాయన్న అనుమానాలు తలెత్తేలా వ్యవహరించడం ఎంత మాత్రం సరికాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అలాంటి తీరు వల్ల ఎన్నికల సిస్టంపై జనాలలో నమ్మకం పోయే పరిస్థితి వస్తుందని అనుమానిస్తున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం బదలీల ప్రక్రియను ఒక్క తెలంగాణలోనే ఆరంభించడమేమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అధికారుల బదలీలను ఎవరూ తప్పు పట్టరు కానీ, వెస్టెడ్ ఇంట్రస్ట్ తో బదలీలను చేపట్టారన్న అనుమానాలు వ్యక్తం కాకుండా ఫిర్యాదులు, ప్రతిపాదనలూ వంటి వాటి జోలికి పోకుండా బదలీలు, నియామకాలు చేపట్టడంతోనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయని అంటున్నారు. 2019 లో ఏపీలో ఏం జరిగిందో.. ఇప్పుడు 2023 ఎన్నికల సమయంలో తెలంగాణలో అదే జరుగుతోందని అంటున్నారు.