హనుమంతన్న మంచి మాట
posted on May 17, 2013 @ 9:28PM
కళంకిత మంత్రులను తొలగించాలని మొదటి నుండి గట్టిగా కోరుతున్న వారిలో సీనియర్ నేత వీ.హనుమంత రావు ఒకరు. అయితే, అది చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లే ఉంది. అయినప్పటికీ, ఆయన అవకాశం దక్కినప్పుడల్లా తన వాదన గట్టిగ వినిపిస్తూనే ఉన్నారు. డిల్లీలో అధిష్టానానికి, రాష్ట్ర నేతలకి మధ్య ఎడతెగక సాగుతున్న మంతనాలను చూసి ఆయన మళ్ళీ ఈ రోజు మరో మారు తన వాదన గట్టిగా వినిపించారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన మంత్రులను నిర్దోషులని నమ్మిన్నంత మాత్రాన్న సరిపోదని, ఆవిషయం ప్రజలు నమ్మడమే ముఖ్యమని ఆయన అన్నారు. వారు నిర్దోషులని ఆయన దృదంగా నమ్ముతున్నందున ‘ఆ ఐదుగురు’ మంత్రులను ప్రభుత్వం నుండి తొలగించి వారికి నిర్దోషిత్వం నిరూపించుకొనే అవకాశం కల్పించాలని, ఒకవేళ వారు నిజంగా నిర్దోషులేనని ఋజువు చేసుకోగలిగితే, దానివల్ల ఆయన అభిప్రాయం నిజమని ప్రజలకి అర్ధం అవుతుందని ఆయన ఒక మంచి లాజిక్ పాయింటు కూడా చెప్పారు. కర్ణాటకలో ప్రజలు అక్కడి బీజేపీ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేఖంగా ఓటువేసి ఓడించిన విషయం కిరణ్ కుమార్ రెడ్డి కూడా బాగా గుర్తుంచు కోవాలని, తన ప్రభుత్వంలో కళంకిత మంత్రులను పెట్టుకొని ప్రజల వద్దకు వెళితే ఏమవుతుందో కర్ణాటక ఎన్నికలు ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాయని అని ఆయన చెప్పారు.