తెదేపా తలుపులు తెరిచిందా?
posted on May 17, 2013 @ 8:45PM
మొన్న తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ తాము తలుపులు తెరవలేదని ఒకవేళ తెరిస్తే ఇక ఇతర పార్టీల దుఖాణాలు మూసుకోవలసిందేనని, కానీ తాము ఆచి తూచి ఎవరినయినా లోపలి రానిస్తామని అన్నారు. మరి ఆయన నిజంగా అచితూచి తీసుకొంటున్నారో లేక తెరాస కంటే తమది పైచేయని నిరూపించుకోవడానికే తీసుకొంతున్నారో కానీ, ఆ పార్టీ నుండి ఎగిరి వచ్చి తమ పార్టీ ఆఫీసు మీద వాలుతున్న తెరాస వలస పక్షులను ఆయన సాదరంగా లోనకి ఆహ్వానిస్తున్నారు. ఇటీవల చాడా సురేష్ కుమార్ రెడ్డి, తన అనుచరులతో సహా వచ్చి తెదేపాలో చేరారు. ఈరోజు దొమ్మేటి సాంబయ్య వచ్చి తెదేపాలో చేరారు. కడియం శ్రీహరి కాళీ చేసిన వరంగల్ యంపీ సీటును ఆశిస్తున్న ఆయనని, పార్టీలోకి తీసుకోవడం ద్వారా చంద్రబాబు ఆ సీటు ఆయనకే ఖరారు చేసినట్లు భావించవచ్చును. సాంబయ్య గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి తెరాసలోకి వెళ్లి, మళ్ళీ ఇప్పుడు పార్టీలోకి తిరిగివచ్చారు. స్థానికంగా మంచి పలుకుబడి ఉన్న సాంబయ్యే, కడియం శ్రీహరి వతని బలమయిన నాయకుడిని ఎదుర్కోవడానికి తగిన అభ్యర్ధి అని చంద్రబాబు భావించి ఆయనను పార్టీలోకి తీసుకొని ఉండవచ్చును.