నేను రాజకీయాల్లో లేకుండా ఉంటే బీజేపీ వాళ్ల నాలుకలు చీరేసేదాన్ని.. మమత
posted on Aug 29, 2022 @ 4:46PM
మమతా బెనర్జీ మరోసారి కేంద్రంపైనా, బీజేపీపైనా తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. తాను రాజకీయాలలో లేకుండా ఉన్నట్లైతే వారి (బీజేపీ) నాలుకలు చీరేసి ఉండేదాన్నని ఆగ్రహం వ్యక్తం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం ర్యాలీని ఉద్దేశించి మమతా సోమవారం (ఆగస్టు 29) ప్రసంగించారు.
బీజేపీ వారు అందరిపైనా ‘దొంగలు’ అన్న ముద్ర వేస్తున్నారని విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు, బీజేపీకి అక్రమంగా సంక్రమించిన సొమ్ముతో రాష్ట్రాలలో ప్రజలెన్నుకున్న బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చివేయాలని ప్రయత్నిస్తున్నదని దుయ్యబట్టారు.2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీని ఓడించి తీరుతానని శపథం చేశారు. తమను వ్యతిరేకించే వారందరిపైనా బీజేపీ ‘దొంగలు’ అన్న ముద్ర వేస్తోందన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్న మనమంతా దొంగలం, ఒక్క బీజేపీ పార్టీ, ఆ పార్టీ నాయకులు మాత్రమే సచ్ఛీలురు అన్నట్లుగా వారి ప్రచారం ఉందన్నారు. తనతో సహా తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేతలు ఫిర్హాద్ హకీమ్, అభిషేక్ బెనర్జీ వంటి సీనియర్ నేతలకు వ్యతిరేకంగా దుర్మార్గమైన ప్రచారానికి బీజేపీ తెరలేపిందన్నారు. తాజాగా ఫిర్హాద్ హకీమ్ కు కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు జారీ చేశాయనీ, బహుశా హకీమ్ ను త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉందని మమతా బెనర్జీ అన్నారు. ఒక వేళ హకీమ్ ను అరెస్టు చేసినా ఎవరూ ఖంగారు పడవద్దనీ, ఆయనపై నమోదు చేసింది తప్పుడు కేసేననడంలో సందేహం లేదనీ మమతా బెనర్జీ అన్నారు.
కేవలం ఆయనను వేధింపులకు గురి చేసేందుకే బీజేపీ తప్పుడు కేసులు బనాయిస్తున్నదని విమర్శించారు. తృణమూల్ నేతల వద్ద కట్టల కొద్దీ సొమ్ము ఉందంటూ బీజేపీ వారు ఆరోపణలు చేస్తున్నారనీ, వాస్తవంగా రాష్ట్రాలలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ వారికి అంత సొమ్ము ఎలా సమకూరిందో వారే చెప్పాలన్నారు. హవాలా ద్వారా బీజేపీ కోట్లాది రూపాయలను విదేశాలలో దాచేసిందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీని ఓడించి తీరాలన్నారు. బేటీ బచావో గురించి మాట్లాడే బీజేపీ బిల్కిస్ బానో అత్యాచార దోషులను ఎలా విడుదల చేసిందని మమతా బెనర్జీ ప్రశ్నించారు. బిల్కిస్ బానో అత్యారార దోషులపై చర్యలకు డిమాండ్ చేస్తూ తాను కోల్ కతాలో 48 గంటల పాటు ధర్నా చేయనున్నట్లు మమతా బెనర్జీ ఈ సందర్భంగా వెల్లడించారు.