గుంటూరు కాంగ్రెస్ గరం గరం
posted on Feb 25, 2012 @ 3:20PM
కన్నా, రాయపాటి వర్గాల మధ్య ముదురుతున్న ఆధిపత్యపోరు
గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చిచ్చు రగిలింది. పచ్చగడ్డివేస్తె భగ్గుమనే రీతిలో మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఎంపి రాయపాటి సాంబశివరావుల మధ్య రెండు దశాబ్దాలుగా ఆధిపత్యపోరు నడుస్తోంది. పదవుల విషయంలోనూ, ప్రాధాన్యత అంశంలోనూ, రాజకీయంగా పై చేయి సాధించడంలోనూ ఇలా ప్రతి అంశంలో ఇరువురు మాటల యుద్ధం సాగిస్తున్నారు. ఈ మాటల యుద్ధం కోర్టులకు కూడా చేరి పరువు నష్టం దావాకేసు రూపంలో కొనసాగుతుంది. రాష్ట్ర పార్టీ నేతలతోపాటు అనేకమంది హేమాహేమీలు వీరి మధ్య సర్దుబాటుకు ప్రయత్నించారు. అయినా ఫలితం కనిపించలేదు. పదవుల విషయంలో ఎంపి రాయపాటి నేరుగా కన్నాపై తరచూ వ్యాఖ్యలు చేస్తుంటారు. కన్నా కూడా అదే రీతిలో ఘాటుగా బదులిస్తుంటారు. ఒకానొక సమయంలో ఇద్దరి ,మధ్య ఆధిపత్యపోరు సామాజిక పోరుగా మారింది. తాజాగా పొన్నూరు నియోజకవర్గం, గుంటూరు రూరల్ నియోజకవర్గంలో మంత్రి కన్నా అతిగా జోక్యం చేసుకుంటున్నారని రాయపాటి ఆరోపిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ మొత్తం ఆయనకు అప్పగించి మేము ఇంట్లో కూర్చోవాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే మంత్రి కన్నా వర్గానికి చెందిన కొందరు నాయకులు గుంటూరు లక్ష్మీపురంలో బాబూజగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటుచేసి మార్చి ఒకటిన స్పీకర్ మీరాకుమార్ చేతుల మీదుగా ఆవిష్కరణకు సిద్దం చేశారు. దీనిపై తనకు సమాచారం లేదంటూ రాయపాటి వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వీరి మధ్య విభేదాలు నానాటికి పెరుగుతుండటంతో గుంటూరు కాంగ్రెస్ ప్రతిష్ట బజారుపాలవుతుంది.