కామారెడ్డిలో టిఆర్ఎస్ కు గట్టిపోటీ తప్పదా?
posted on Feb 25, 2012 @ 3:31PM
హైదరాబాద్: ఉప ఎన్నిక జరుగనున్న కామారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఉద్యమం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఫలితం ఏక పక్షంగా ఉంటుందన్న అంచనాకు వచ్చిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు టిఆర్ ఎస్ దూకుడును అడ్డుకునే దిశగా పావులు కదుపుతున్నాయి. టిఆర్ ఎస్ కు గట్టిపోటీ ఇచ్చేందుకు ఈ రెండు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మండలస్థాయి నేతల్లో పెరుగుతున్న అసమ్మతి ఆ నాయకత్వానికి సవాలుగా మారింది. తన అనుచరుడిని రంగంలోకి దింపిన షబ్బీర్ అసమ్మతులను బుజ్జగించే పనిలో పడ్డారు. పార్టీపరంగా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన పరువు దక్కించుకోవడానికి తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మైనార్టీల్లో కాస్త పట్టున్న యూసఫ్ అలీ అనే టిఆర్ ఎస్ నాయకుడితో తెలుగుదేశం పార్టీ మంతనాలు జరుపుతోంది. ఆయన రెండు మూడు రోజుల్లో టిడిపిలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది, ఇదే జరిగితే నియోజకవర్గంలో టిఆర్ ఎస్ ను చిన్న ఎదురుదెబ్బ తగిలినట్లే అవుతుంది. కాంగ్రెస్, టిడిపిలు ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్దపడుతుండటంతో టిఆర్ ఎస్ కూడా అందుకు తగ్గట్లుగా ప్యుహాలను రూపొందిస్తుంది. లక్ష్యసాధనకై జిల్లాలోని అన్ని ప్రాంతాలనుంచి క్యాడర్ ను కామారెడ్డికి తరలిస్తుంది.