మంత్రి ధర్మానకు ముచ్చెమటలు
posted on Feb 25, 2012 @ 3:16PM
అవినీతి ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి
హైదరాబాద్: మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తన కుమారుడు రామ్ మనోహర్ నాయుడుకి మద్యం సిండికెట్ లో వాటా ఉందని అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఏకంగా ఏసిబి రిమాండ్ డైరీ నివేదిక సభలోచదివి ధర్మానపై నిప్పులు చెరిగారు. మరోవైపు కరీంనగర్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ ధర్మాన తనయుడు విందుకోసం కళాశాల తీసుకోవడమే కాకుండా పరీక్షాకేంద్రం రాకుండా అడ్డుకోవడం నిజంగా అధికార దుర్వినియోగమేనని నిరూపిస్తానని తేదీ ఖరారు చేసుకోవాలని ఆయన సవాలు విసిరారు. ఇంకోవైపు ధర్మాన తనయుడి పేరుతో అక్రమంగా పొందిన కన్నెధారకొండ గ్రానైట్ కౌలును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద వందల సంఖ్యలో గిరిజనులు వంటా వార్పూ కార్యక్రమంతో నిరసన తెలుపుతున్నారు.
మంత్రి ధర్మాన పిఎలు రవిశంకర్, అప్పారావు, మేనల్లుడు చిన్నాల వెంకట్ కు మద్యం సిండికెట్ తో సంబంధం ఉన్నట్లు ఏసిబి అధికారులు గుర్తించారు. వీరితో పాటు మంత్రి అనుచరులుగా ఉన్న కొందరి పేర్లు ఏసిబి రిమాండ్ డైరీలో నమోదయ్యాయి. ఇవన్నీ మంత్రి ధర్మానను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.