జీఎస్టీ బిల్లుకు మూహూర్తం వచ్చే వారమే..
posted on Jul 29, 2016 @ 1:15PM
జీఎస్టీ బిల్లును ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటినుండో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకపక్క లోక్ సభలో బిల్లుకు ఆమోదం లభించినా.. రాజ్యసభలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ బిల్లుకు ప్రతిపక్షపార్టీ అయిన కాంగ్రెస్ అడ్డుకట్టగా మారింది. ఈ బిల్లుకు సంబంధించి గతంలో ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో కూడా మంతనాలు జరిపారు. అయితే అప్పుడు కాంగ్రెస్ కొన్ని షరతులు పెట్టినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తుంది. వచ్చే వారమే బిల్లును సభలో ప్రవేశ పెట్టి ఆమోదంపొందడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పటికే బిల్లులో రెండు కీలక సవరణలు చేసిన నేపథ్యంలో.. అభ్యంతరం వ్యక్తం చేసిన పార్టీలన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా..బిల్లుపై చర్చలు సరైన దిశలోనే నడుస్తున్నాయని అనడంతో ఇక జీఎస్టీకి సభ ఆమోదం లభించడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి మెలిక పెడుతుందో..