భాగాలు భాగాలుగా బయటకు వస్తున్న రాయల్ వశిష్టా.....
posted on Oct 22, 2019 @ 12:21PM
తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరి నదిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు వెలికితీత పనుల్లో పురోగతి లభిస్తోంది.కచ్చులూరులో ఇవాళ కూడా కొనసాగనున్నాయి. బోటు పైభాగాన్ని మాత్రమే బయటకు తీసుకురాగలిగారు. మట్టి, ఇసుకతో నిండి పోవడంతో ఒకేసారి బోటును లాగే అవకాశాలు కనిపించడం లేదు. భాగాలు భాగాలుగా వెలికితీయాలని భావిస్తున్నారు. మరోవైపు ముప్పై ఆరు రోజులుగా బోటు నీట మునిగి ఉండటంతో మిగిలిన మృతదేహాల లభ్యం కష్టమేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.అనేకానేక ప్రయత్నాల తర్వాత బోటుకు సంబంధించిన కొంత భాగాన్ని ధర్మాడి సత్యం బృందం సభ్యులు ఒడ్డుకు లాగారు. వెలికితీత ప్రయత్నాల్లో బోట్ పైకప్పు విడిపోయి బయటకు వచ్చింది. ముందువైపు రోప్ ద్వారా బయటకు వచ్చిన ఈ భాగాన్ని డ్రైవర్ క్యాబిన్ గా గుర్తించారు. క్యాబిన్ పై రాయల్ వశిష్ట అని పేరున్న బోర్డు స్పష్టంగా కనిపిస్తోంది.
మరోవైపు నీటిలో మునిగిన మిగిలిన బోటును కూడా పైకి లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నీటిలో ఉన్న బోటును ఒకేసారి పైకి లాగడం సాధ్యం కాదని ధర్మం సత్యం బృందం భావిస్తోంది. నెల రోజులకు పైగా నీటిలోనే మునిగి ఉండటంతో బోట్ భాగాలన్నీ శిథిలమయ్యాయి. వరదల కారణంగా ఒండ్రు మట్టి బాగా పేరుకుపోయింది. ఇసుక బోటుని కప్పేసింది. దాంతో చాలా భాగం బయటకు తీయడం సమస్యవుతుంది. బలంగా ప్రయత్నం చేయడంతో చివరకు బోట్ విడిపోతోంది. భాగాలుగా వస్తోంది. దీంతో ధర్మాడి సత్యం బృందం కూడా విడివిడి భాగాలుగానే పైకి తీసే అవకాశం ఉందని తెలుస్తోంది. సాధారణంగా బోటు భాగాలను ఐరన్, ప్లైవుడ్, చెక్కలతో తయారు చేస్తారు. ఇప్పటికే ఇనుముతో కూడిన బోటు భాగాలు పూర్తిగా తుప్పు పట్టిపోవడంతో సులువుగా విరిగిపోతున్నాయి. ఇక గట్టి వస్తువు ఏదైనా తగలగానే ప్లై ఉడ్ పార్ట్స్ సైతం ఎక్కడికక్కడ ముక్కలవుతున్నాయి. దీంతో ఒకేసారి బోటును పైకి లాగడం కంటే విడివిడి భాగాలుగానే లిఫ్ట్ చేయడం మంచిదని ధర్మాడి సత్యం బృందం భావిస్తోంది.గోదావరిలో మునిగిన బోటు ప్రస్తుతం ఏటవాలుగా మునిగి ఉందని డ్రైవర్ లు చెబుతున్నారు. డ్రైవర్ ల బృందానికి చెందిన ఇద్దరు బోటు మునిగిన ప్రదేశంలో నీటి అడుగు భాగంలోకి వెళ్లారు. దాదాపు పదిహేను నిమిషాల పాటు ఆ ప్రాంతంలో బోటు ఎలా ఉంది. దాని చుట్టూ ఇసుక మట్టి ఎంత మేర పేరుకుపోయాయి బోటుకు ఎక్కడ తాడు బిగిస్తే పైకి రావడానికి అనువుగా ఉంటుందనే కోణంలో పరిశీలించారు. నదిలో బోటు ముందు భాగం నలభై అడుగుల లోతులో ఉంటే వెనుక భాగం దాదాపు డెబ్బై అడుగుల లోతులో ఉందని వారు చెబుతున్నారు.
ప్రస్తుతం గోదావరిలో సుడిగుండాలు లేకపోవటం, నీటి మట్టం ముప్పై ఎనిమిది నుంచి నలభై అడుగుల స్థాయిలోనే ఉండటంతో బోటును వెలికి తీసేందుకు సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి అని అంటున్నారు. మరోవైపు బోటు మునిగిన ప్రాంతంలో ఆదివారం నల్ల జీన్ ప్యాంట్ ధరించిన ఓ మహిళ మృతదేహం లభ్యం కావడంతో మిగిలిన వారి ఆచూకీ పైన మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ప్రమాదంలో గల్లంతైన మిగిలిన వారు కూడా బోటు కిందే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే తాజాగా దొరికిన మృతదేహానికి తల భాగం లేకపోవటంతో మిగిలిన వారి పరిస్థితి ఏంటనే దానిపైనా సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. నెల రోజులకు పైగా మృతదేహాలు బోటులోనే ఉండుటే అవి మామూలు స్థితిలో ఉండే అవకాశం లేదంటున్నారు నిపుణులు. మృతదేహాలు ఖచ్చితంగా నీటిలోనే జీవులకు ఆహారంగా మారి వాటి అవశేషాలు మాత్రమే లభించే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
బోటు వెలికితీసిన అస్తిపంజరాలు తప్ప మరేం లభించకపోవచ్చని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రమాదం సమయంలో బోటులో ఉన్న వారి సంఖ్యపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. మునిగిన బోటులో అసలు ఎంతమంది ఉన్నారనే అంశంపై ఎవరికీ స్పష్టత లేదు. ఇప్పటి వరకు బోటులో మొత్తం డెబ్బై ఏడు మంది ఉన్నారని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఇరవై ఆరు మందిని గిరిజనులు రక్షించారని ముప్పై తొమ్మిది మృతదేహాలు లభ్యమయ్యాయని మరో పన్నెండు మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అంటోంది.
అయితే బోటులో వెళ్లింది డెబ్బై ఏడు మంది కాదని తొంభై మూడు మంది అని కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్ష కుమార్ ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని వాదిస్తున్నారు. ఇదే విషయమై ఆయన న్యాయ పోరాటం సైతం చేస్తున్నారు. సెప్టెంబర్ పదిహేనున పాపికొండల యాత్రకు డెబ్బై ఏడు మంది యాత్రికులతో బయలుదేరిన బోటు కచ్చులూరు మండల సమీపంలో ప్రమాదానికి గురైంది. బోటును వెలికితీయడంతో పాటు మృతదేహాల కోసం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఆపరేషన్ ప్రారంభమైంది. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్ సంస్థకు ఇరవై రెండు పాయింట్ ఏడు లక్షల రూపాయలకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ధర్మాడి సత్యం బృందం ఈ పనులు చేపట్టింది. తొలుత ఐదు రోజుల పాటు ప్రయత్నాలు సాగించినా ఫలించలేదు. అదే సమయంలో గోదావరికి వరద పోటెత్తడంతో అక్టోబర్ మూడున ఆపరేషన్ నిలిపివేశారు. గోదావరి శాంతించడంతో అక్టోబర్ పదహారు నుంచి మరోసారి ప్రయత్నాలు ప్రారంభించారు.
తొలుత ధర్మాడి సత్యం బృందం చేసిన ప్రయత్నాల ప్రకారం లంగర్ కి బోటు తగలడంతో ఒడ్డుకి చేరుతుందని ఊహించినప్పటికీ అది నెరవేరలేదు. దాంతో ప్లాన్ మార్చారు. విశాఖ నుంచి డ్రైవర్ లను రంగంలోకి దింపారు. ఆక్సిజన్ సిలిండర్ల సహాయంతో నది అడుగు భాగానికి వెళ్లాలని నిర్ణయించి ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. గోదావరిలో నీటి మట్టం తగ్గడంతో అందుకు అవకాశం ఏర్పడింది. చివరకు బోటు లో కొన్ని భాగాలు బయటకువచ్చాయి. బోటు మొత్తం బయటకు వస్తుందని ఆశించామని కానీ ప్రయత్నాలు పూర్తిగా సఫలం కాలేదని ధర్మాడి సత్యం చెబుతున్నారు. అయినా ఆపరేషన్ సాగిస్తామని బోటును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒడ్డుకూ చేరుస్తామని ఆయనంటున్నారు. ఇలా ఉంటే పోటు వెలికితీతపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలోనే బోటును బయటకు తీసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని వివిధ పార్టీలు ఆరోపిస్తున్నాయి. బోటు పూర్తిగా మట్టిలోకి కూరుకుపోయాక చర్యలు చేపట్టారని మండిపడుతున్నాయి. అందుకే ఈ పరిస్థితి తలెత్తిందని విరుచుకు పడుతున్నాయి. ఈ రోజు ఐనా బోటు ఏ ఆటంకాలు లేకుండా బయటకు వస్తుందో లేదో వేచి చూడాలి.