మావోయిస్టులతో సంబంధం లేదు..సాయిబాబా విడుదలకు కోర్టు ఆదేశాలు
posted on Oct 14, 2022 @ 12:48PM
ప్రొఫెసర్ సాయిబాబాను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని ముంబై హైకోర్టు ఆదేశించింది. తనకు జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్ కోర్టు 2017వ సంవత్సరంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జిఎన్ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్ రోహిత్ డియో, అనిల్ పన్సారేలతో కూడిన నాగపూర్ డివిజన్ బెంచ్ అనుమ తించింది. ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు మరో అయిదుగురికి ఈ కేసు నుంచి విముక్తి లభించింది. శారీరకంగా వికలాంగుడయి వీల్‌చైర్‌కే పరిమితమయిన ఇంగ్లీషు ప్రొఫెసర్ సాయి బాబా 2014 లో అరెస్టయి నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ కేసులో అరెస్టయిన మిగిలినవారిలో మహేష్ తిక్రి, పాండు పోరా నరోత్, హేమ్‌కేశవ్‌దత్త మిశ్రా, ప్రశాంత్ రాహి, విజయ్ నానతిక్రి ఉన్నారు. అయితే వారిలో పాండుపోరా నరోత్ ఈ ఏడాది ఆగష్టులో మరణించాడు. మావోయిస్టులతో సంబంధం లేదని తేలడంతో వీరందరిని, వేరే కేసుల్లో ఎలాంటి సంబంధాలు లేకుంటే, వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.
2017 మార్చిలో మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లా కోర్టు ప్రోఫెసర్ సాయిబాబా తదితరులను మావోయిస్టులతో సంబంధాలున్నాయన్నకేసులో అరెస్టు చేయమని ఆదేశించింది. వారిలో ఒక జర్నలిస్టు, జవహర్‌లాల్ నెహ్రూ వర్సిటీ విద్యార్ధి కూడా ఉన్నారు. వీరంతా మావోయిస్టులతో కలిసి దేశంలో అల్లర్లు చేయడానికి కుట్రపన్నుతున్నారన్న అభియోగంతో యుఏపిఏ, ఐపిసీ క్రింద అరెస్టయ్యారు.