శ్రీనివాసరావు డిల్లీ యాత్రకి బ్రేకులేసిన చిరంజీవి?
posted on Jan 16, 2013 @ 10:51AM
ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన అనకాపల్లి శాసనసభ్యుడు గంటా శ్రీనివాస రావు చిరంజీవి వెంటతిరుగుతూ, రాష్ట్రంలో మంత్రి పదవి కూడా కైవసం చేసుకొని రాష్ట్ర రాజకీయాలలోచక్రం తిప్పుతున్నారిప్పుడు.
కొద్దిరోజులక్రితం విశాఖలో జరిగిన సమైక్యాంధ్ర సభలో పాల్గొని తానూ సమైక్యవాదినని విస్పష్టంగా తెలియజేసారు. తమ నాయకుడు చిరంజీవి కూడా సమైక్యవాదయినప్పటికీ, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న కారణంగా, ఆయన తన మనసులో మాటను పైకి అనలేకపోతున్నారనే సంగతి గ్రహించిన గంటా శ్రీనివాసరావు, గత కొద్ది రోజుల నుండి కొంచెం గట్టిగానే సమైక్యంద్ర గళం వినిపించడం మొదలుపెట్టారు.
మరొక పదిరోజుల్లో కేంద్రం రాష్ట్ర విభజనపై తన నిర్ణయం ప్రకటించనున్న ఈ తరుణంలో, విభజన ఖాయం అని వస్తున్న వార్తల నేపద్యంలో కొంత మంది సీమంద్రా మంత్రులు, శాసనసభ్యులతో కలిసి గంటా శ్రీనివాసరావు కూడా డిల్లీ వెళ్లి సమైక్యాంద్రకు అనుకూలంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని సిద్దమయారు. అయితే ఆఖరి నిమిషంలో ఆయన ప్రయాణం వాయిదాపడింది.
కేంద్రం తన నిర్ణయం ప్రకటించబోతున్న తరుణంలో తన సహచరుడయిన ఆయన స్వయంగా డిల్లీ వెళ్ళినట్లయితే, తానే వెనకుండి కధ నడిపిస్తున్నాననే తెరాస వాదనకి బలం చేకూర్చినట్లు ఉంటుందని చిరంజీవి భావించడం వల్లనే గంటా శ్రీనివాసరావు ప్రయాణానికి చిరంజీవి బ్రేకులు వేసి ఉండవచ్చును.