పయ్యావుల ఎపిసోడ్: ఎర్రబెల్లికి గాలి కౌంటర్

 

 

 

పయ్యావుల కేశవ్ ఏం తప్పు చేశారని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు ప్రశ్నించారు. పయ్యావులపై గురువారం ఎర్రబెల్లి దయాకరరావు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన మాట్లాడుతూ ప్రజల ఎజెండానే పయ్యావుల మాట్లాడుతున్నారని మద్దతుగా మాట్లాడారు. అఖిలపక్షానికి ఆహ్వానంపై తమకు ఇంకా లేఖ అందలేదని, అందిన తర్వాత పార్టీలో చర్చించి అఖిలపక్ష భేటీపై వెల్లడానికి తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటారని ముద్దు కృష్ణమ పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో ప్రజల తీర్పు తర్వాతే విభజనై అడుగు ముందుకు వేయాలని ఆయన వ్యాఖ్యానించారు.

 


పయ్యావుల వివరణ:

తెలుగుదేశం పార్టీ వైఖరికి భిన్నంగా ప్రవర్తించలేదని, విభజనపై సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ తన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని తెలుగుదేశం నాయకుడు పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. గురువారం ఆ పార్టీ నేత ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలపై పయ్యావుల మీడియాతో మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానో పార్టీ అధినాయకత్వానికి వివరించానని అన్నారు. తెలుగుదేశం పార్టీ విధానానికి భిన్నంగా తన పిటిషన్ లేదని పయ్యావుల స్పష్టం చేశారు. ఎవరిని సస్పెండ్ చెయ్యాలన్న పార్టీదే నిర్ణయమని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పయ్యావుల స్పష్టం చేశారు.