గడప గడపకూ బాధ్యతలు మాజీ మంత్రులకు
posted on Jul 23, 2022 @ 11:31AM
జగనాగ్రహానికి పార్టీలో ప్రముఖుల ప్లేస్ లు మారిపోతున్నాయి. పనికి రారన్నట్లుగా కేబినెట్ నుంచి ఉద్వాసన గురైన వారికే ఇప్పుడు వైసీపీ అధినేత గడపగడపకూ మన ప్రభుత్వం బాధ్యతలను అప్పగించారు. ఈ అప్పగింతకు ముందు ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు గట్టి క్లాసే పీకారు. అయినా వారిలో స్పందన లేదన్న నిర్ణయానికి వచ్చేసి ఈ సారి ఆ బాధ్యతలను పార్టీ జిల్లా అధ్యక్షుడు, రిజనల్ కో అర్డినేటర్లకు అప్పగించేశారు. విచిత్రమేమిటంటే వీరిలో అత్యధికులు ఇటీవలి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమాత్య పదవులను పోగొట్టుకున్న వారే.
ఇలా బాధ్యతలు బదలాయించడానికి జగన్ పెప్పిన కారణమేమిటంటే..గడప గడపకూ వోళ్లని ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్లు ఇచ్చేది లేదని చెబుతున్నా ఓ పది.. పదిహేను మంది తప్ప ఎవరూ సీరియస్ గా తీసుకోలేదని. దీంతో ఆయన ఎలాగైనా ఎమ్మెల్యేల్ని గడప గడపకూ తరలించాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే ఈ సారి జిల్లాల అధ్యక్షులు.. రీజనల్ కోఆర్డినేటర్లతో మీటింగ్ పెట్టారు. వీరిలో ఎక్కువ మంది ఇటీవల పదవులు పోగొట్టుకున్న మాజీ మంత్రులే. వారికే ఇప్పుడు ఎమ్మెల్యేలతో ప్రోగాంను సక్సెస్ చేయించాల్సిన బాధ్యత ఇచ్చారు. వాళ్లకి ఐప్యాక్ టీం సహకరించేలా ఏర్పాటు చేశారు. ఐ ప్యాక్ టీంలు జిల్లాల వారీగా పని చేస్తాయని వారితో సమన్వయం చేసుకోవాలని జగన్ ఆదేశించారు. మొత్తానికి గడపగడపకూ మన ప్రభుత్వాన్ని విజయవంతం చేసే బాధ్యత అంతా పార్టీ జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లదేనని జగన్ విస్పష్టంగా చెప్పేశారు. మాజీలకు ఈ బాధ్యతలు అప్పగించడంతో మళ్లీ మంత్రులు డమ్మీలేనని చెప్పకనే చెప్పేశారు. దీంతో ఈ మాత్రం దానికి తమకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికి మాజీలను చేయడమెందుకని తాజా మాజీలు ఒకింత నిరసన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రలు అధికారం అనుభవిస్తుంటే.. మాజీలమైన తాము పార్టీకి ఊడిగం చేయాలా అన్న సణుగుడు మాజీలలో మొదలైందని పార్టీ శ్రేణులే అంటున్నారు. మంత్రులను కాదని తమ మాట క్యాడర్ ఎందుకు వింటుందన్న సందేహమూ వారిలో వ్యక్తం అవుతోంది.
అంతే కాకుండా తమ తమ నియోజకవర్గాలలో తామూ గడపగడపకూ వెళ్లాలి కదా అని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వంపై ఆగ్రహాన్ని జనం ఎమ్మెల్యేలపై వెళ్లగక్కితే వారి ఆగ్రహం ఏదో మేరకు చల్లారుతుందన్న జగన్ భావిస్తున్నట్లుందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఏది ఏమైనా జగన్ ఎంత మొత్తుకున్నా, తాపత్రేయపడినా, హెచ్చరికలు చేసినా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం పట్ల పార్టీలో ఎవరూ సీరియస్ గా లేదని పార్టీ నాయకులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు.