న్యాయశాఖ పరిశీలనలో జమిలి ప్రతిపాదన
posted on Jul 23, 2022 @ 12:42PM
జమిలి ఎన్నికల విషయాన్ని కేంద్రం ఇంకా వదల లేదు. లోక్ సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తే వ్యయం కలిసి వస్తుందని కేంద్రం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ అంశం లాకమిషన్ పరిశీలనలో ఉందని కేంద్రం తెలిపింది. లోక్ సభలో ఒక సభ్యుడి ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. జమిలి ఎన్నికలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కేంద్ర ఎన్నికల సంఘం సహా అనేక భాగస్వామ్య పక్షాలతో చర్చించినట్లు చెప్పారు.
కాగా స్టాండింగ్ కమిటీ కొన్ని ప్రతిపాదనలు, సిఫార్సులు చేసిందని, ఆ నివేదిక ఆధారంగా లా కమిషన్ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోందని ఆయన తెలిపారు. తరచుగా వచ్చే ఎన్నికల వల్ల నిత్యావసర సేవలు సహా ప్రజా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయని స్టాండింగ్ కమిటీ తన నివేదికలో పేర్కొంది. పార్లమెంటుకు, రాష్ట్ర అసెంబ్లీలకు వేరువేరుగా జరిగే ఎన్నికల కారణంగా భారీగా ప్రజాధనం వ్యయం అవుతుందనీ, దేశంలో 2014-22 మధ్యకాలంలో 50 ఎన్నికలు జరిగాయని స్టాండింగ్ కమిటీ వివరించింది. ఈ ఎనిమిదేళ్లలో ఎన్నికల నిర్వహణ కోసం రూ. 7వేల కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చయ్యిందని కిరణ్ రిజుజు తెలిపారు. కిరణ్ రిజుజు సమాధానంతో కేంద్రం మదిలో జమిలి ప్రతిపాదన ఇంకా సజీవంగానే ఉందని, లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ఉద్దేశంతోనే ఉందని అవగతమౌతుంది.
మోడీ అధికారంలోకి రాగానే ఈ ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఎన్నికల విధానంలో మార్పుల వల్ల అభివృద్ధి వేగవంతమౌతుందని ఆయన చెబుతున్నారు. లోక్ సభ నుంచి స్థానిక ఎన్నికల వరకూ ఒకే సారి నిర్వహించడం వల్ల ప్రజా ధనం ఆదా కావడమే కాకుండా అభివృద్ధికి అవరోధాలు ఉండవని అన్నారు. అయితే విపక్షాలు నిర్ద్వంద్వంగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. కేంద్రం చెబుతున్న వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఫెడరల్ స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని అంటున్నారు. జమిలి పేర కేంద్రంతో పాటు రాష్ట్రాలలో కూడా అధికారం గంపగుత్తగా చేజిక్కించుకోవాలన్న దురాలోచనలో ప్రభుత్వం ఉందని అభ్యంతరం చెబుతున్నాయి.
అయితే లోక్‌సభ ఎన్నికలే అయినా.. రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా.. పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పోల్స్ అయినా.. ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుందన్నది మోడీ వాదన. పదేపదే ఎన్నికలు జరగడం అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయన్నది ఆయన అభిప్రాయం. 2019 బీజేపీ మానిఫెస్టోలో జమిలి అంశాన్ని చేర్చింది. నీతీ ఆయోగ్ కూడా నివేదిక సిద్ధం చేసింది. లా కమిషన్ అభిప్రాయ సేకరణ తీసుకుంది. ఈసీ కసరత్తు చేస్తోంది. పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. దీనిపై ఏకాభిప్రాయం వ్యక్తం అయితే రాజ్యాంగ సవరణ ద్వారా వన్ నేషన్.. వన్ ఎలక్షన్‌కు ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
అయితే జమిలి ఎన్నికల నిర్వహణకు కనీసం అయిదు రాజ్యాంగ సవరణలను చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఇందుకు దేశంలో సగం రాష్ట్రాల ఆమోదం కూడా అవసర అవుతుంది. ప్రస్తుతం దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలిత రాష్ట్రాల సంఖ్యే అధికం. లోక్ సభలో మోడీ సర్కార్ కు పూర్తి మెజారిటీ ఉంది. రాజ్యసభలో సభ్యుల బలం ఒకింత తక్కువైనా కేంద్రం నిర్ణయాలకు వత్తాసు పలికే పార్టీలు ఉండటంతో అక్కడా ఆమోదం పొందడం పెద్ద కష్టం కాదు. దీంతో జమిలి ప్రతిపాదన అమలుకు ఇదే మంచి తరుణం అని మోడీ సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిగణనలోనికి తీసుకుంటే మోడీ సర్కార్ జమిలి విషయంలో అడుగు ముందుకు వేసే అవకాశాలే అధికంగా ఉన్నాయని పరిశీలకులు సైతం భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలు సైతం జమిలికి సిద్ధంగా ఉన్నామన్న సంకేతులు ఇస్తున్నాయి. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో జమిలికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చిన సంగతి విదితమే.