కర్నాటకకు వరాలు.. ఎన్నికల తాయిలమేనా?
posted on Feb 1, 2023 @ 11:21AM
నిర్మలమ్మ తన బడ్జెట్ లో కర్నాటక రాష్ట్రానికి వరాల జల్లు కురిపించింది. ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్ లో పెద్ద పీట వేశారు. ఆ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలలో సాగు రంగానికి ప్రత్యేకంగా 5300 కోట్లు కేటాయించారు.
ఇక దేశ వ్యాప్తంగా విమానాశ్రయాలు, హెలీప్యాడ్ ల నిర్మాణానికి నిధులు కేటాయించారు. అలాగే 5జీ సేవల అభివృద్ధి కోసం ప్రత్యేక ల్యాబ్ లు ఏర్పాటు చేస్తామన్నారు. పీఎం కౌశల్ పథకం కింద నాలుగు లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.
దేశంలో టూరిజం అభివృద్ధి కోసం కొత్తగా 50 టూరిస్టు స్పాట్ ల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. అలాగే దేశీయ ఉత్పత్తుల విక్రయాల ప్రోత్సాహానికి దేశ వ్యాప్తంగా యూనిటీ మాల్స్ ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించారు. ఇక వయోవృద్ధుల పొదుపు పథకంలో డిపాజిట్ పరిమితిని పెంచారు.
ఇప్పుడు రూ.15లక్షలుగా ఉన్న పరిమితిని 30 లక్షలకు పెంచారు. ఇక మహిళల కోసం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ను తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. రెండేళ్ల పాటు అమలులో ఉండే ఈ పథకంలో డిపాజిట్ పై 7.5శాతం వడ్డీ ఇస్తారు. ఈ పథకం కింద గరిష్టంగా రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేసుకోవచ్చు.