జగన్ కి కోపమొచ్చింది.. ఏపీ కేబినెట్ నుంచి నలుగురు మంత్రులు ఔట్!!

 

నాన్ వెజ్ కి రుచి మరిగిన పులితో.. ఇక నుంచి నువ్వు ప్యూర్ వెజిటేరియన్ వి, నాన్ వెజ్ అస్సలు ముట్టకూడదు అని చెప్తే వింటుందా? చెప్పండి. వద్దన్నా నాలుక నాన్ వెజ్ వైపు లాగేస్తుంది. ఏపీలో కొందరి పొలిటీషియన్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వద్దన్నా అవినీతి చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్ కి తలవంపులు తీసుకొస్తున్నారు.

జగన్ ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత బలంగా చెప్పిన మాట.. అవినీతిరహిత పాలన అందిస్తా, మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని చెప్పారు. అంతేకాదు అసలు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అవినీతి చేయడానికి వీల్లేదని, అవినీతి చేస్తే అస్సలు సహించనని వార్నింగ్ కూడా ఇచ్చారు. అయినా కొందరు నేతల్లో మార్పు కనిపించట్లేదు. అధికారంలో ఎంతకాలం ఉంటామో తెలియదు, ఉన్నప్పుడే అందినకాడికి దోచుకోవాలి అనుకుంటున్నారు. ఏదైనా అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పాత సామెతను చెప్తున్నారట. అయితే నేతల అవినీతి వ్యవహారం జగన్ వరకు చేరడంతో.. ఇప్పటికే వారిని పిలిచి జగన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట. అంతేకాదు కొందరు మంత్రులను అసలు కేబినెట్ నుంచి తప్పించాలనే ఆలోచనలో కూడా ఉన్నారట.

కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు.. అవినీతికి పాల్పడుతున్నారట. ఆ లిస్ట్ జగన్ కి చేరడంతో గట్టి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా.. ఈ ఐదు నెలల్లో అవినీతిలో టాప్ లిస్ట్ లో ఉన్న ఓ నలుగురు మంత్రులని పదవి నుంచి తప్పించాలి అనుకుంటున్నారట. అలా చేయటం వల్ల మిగతా మంత్రులు.. ఎక్కడ తమ మంత్రి పదవి కూడా పోతుందేమోనన్న భయంతో అవినీతి చేయడం మానేస్తారు. ఎమ్మెల్యేలు కూడా తమకి మంత్రి పదవి దక్కదేమోనన్న భయంతో అవినీతి మానేస్తారు. అందుకే జగన్ ఆ నలుగురు మంత్రులని టార్గెట్ చేసారని తెలుస్తోంది.

మరోవైపు ఆ  నలుగురు మంత్రులు ఎవరా? అన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆ నలుగురిలో.. ఇద్దరు బీసీ మంత్రులు, ఒక ఓసీ మంత్రి, ఒక ఎస్సీ మహిళా మంత్రి ఉన్నారని తెలుస్తోంది. వీరిలో ఇద్దరు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు కాగా, మరో ఇద్దరు కోస్తా ఆంధ్రాకు చెందిన వారని సమాచారం. ఈ మంత్రుల అవినీతిపై ఇప్పటికే పలు ఫిర్యాదులు జగన్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఒక బీసీ మంత్రిపై అవినీతి ఆరోపణలతో పాటు, ఆయన వ్యవహారశైలిపై కూడా సొంత పార్టీ నేతలే జగన్ కి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఈ నలుగురిలో మొదట హిట్ లిస్ట్ లో ఆ మంత్రే ఉన్నారు అంటున్నారు.

ఇక మహిళా మంత్రి విషయానికొస్తే.. ఆమె పదవిని అడ్డుపెట్టుకొని ఆమె భర్త వసూళ్లకు పాల్పడుతున్నట్లు.. కొందరు జగన్ దృష్టికి తీసుకెళ్లారట. అంతేకాదు ఒకసారి ఆ దంపతులు ఎవర్నో డబ్బులు డిమాండ్ చేసారని తెలియడంతో.. జగన్ స్వయంగా ఆ మహిళా మంత్రికి ఫోన్ చేసి.. ఎంత కావాలమ్మా డబ్బులు అన్నారట. దీంతో హడలిపోయిన మంత్రి.. జగన్ కి ఎదురుపడాలంటేనే భయపడుతున్నారట. మొత్తానికి టాప్ 4 లిస్ట్ లో మహిళా మంత్రి రెండో ప్లేస్ లో ఉండగా.. ఒక బీసీ మరియు ఒక ఓసీ మంత్రి.. తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నారట. ఇప్పటికే ఆ నలుగురు మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన జగన్.. ఏ క్షణమైనా వారిని తప్పించి వేరే వారికి అవకాశమిచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు.