బాధలు చెప్పుకుంటే.. తరిమేస్తారా?
posted on Aug 2, 2022 @ 1:44PM
ప్రభుత్వ తీరుతెన్నులు బాగుండకపోతే ప్రజలు సమస్యల పాలవుతారు. నాయకులు అన్యాయంగా వ్యవహరిస్తే రక్షించేవారి దగ్గరికి వెళ్లి గోడు చెప్పుకుంటారు. ప్రజలకు కావాల్సింది సామాజిక, ఆరోగ్య భద్రత. ప్రజలను కేవలం ఓట్లుగా చూసేవారికి వారెప్పుడూ దూరమే. అసలే భారీ వర్షాలు, వరదలతో నానా నవస్థలూ పడుతున్న ప్రజలు, సర్వం కోల్పోయిన బాధితులు తమ గోడు విని తమకు న్యాయం చేయాలని, తమను ఆదుకోవాలని గొంతు చించుకుంటున్నా ప్రభుత్వం తాత్కాలిక సహాయంతో సరిపెట్టుకుంది. అందుకే తమ గోడు చెప్పుకోవడానికి ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తమ వద్దకు పరామర్శకు వచ్చినపుడు బాధలు చెప్పుకున్నారు. అందుకు ఆగ్రహంచి అధికార వైసీపీ నేతలు వారిని పునరావాస కేంద్రాలనుంచి వెళ్లగొట్టడం మానవత్వం అనిపించుకుంటుందా? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
గోదావరి వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులు తాను పరామర్శించడానికి వెళ్లినప్పుడు తమ బాధలు చెప్పుకొంటే వారి ని వేధించడం దారుణమని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వేలేరుపాడులో పర్యటించినప్పుడు వరద సాయం అంద లేదని కొందరు మహిళలు చెప్పారు. ఆ కోపంతో వారిని పునరావాస కేంద్రం నుంచి వెళ్లగొట్టడం.. పైగా బెదిరించడం దారుణం. వైసీపీ నేతల క్రూరత్వం తెలిసిందే. రెవెన్యూ ఉద్యోగులు వారికి వంత పాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మనం ఆటవిక యుగంలో ఉన్నామా? ప్రతిపక్ష నేతలకు కష్టాలు చెప్పుకొంటే ప్రతీకార చర్యలా? వైసీపీ నేతల శాడిజాన్ని ఖండిస్తున్నా’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
వరద బాధితులను ఆదుకోవాలని ప్రవాసాంధ్ర టీడీపీ విభాగం అమెరికా సమన్వయకర్త కోమటి జయరాం పిలుపిచ్చారు. కాలిఫోర్నియా రాష్ట్రంలోని బే ఏరియాలో సోమవారం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా మూడో మహానాడు కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అనేక సందర్భాల్లో అమెరికాలోని తెలుగువారు స్పందించి ఆదుకున్న చరిత్ర ఉందని, ఇప్పుడు కూడా అదే మాదిరిగా సాయం చేయాలని కోరారు. రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆన్‌లైన్‌లో ఈ సమావేశంలో మాట్లాడారు. కోగంటి వెంకట ప్రసాద్, ఉప్పల వీరు, దొడ్డపనేని శ్రీకాంత్, కాకరాల రజని, లీయోన్ రెడ్డి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.