బాధ, ఆవేదనతోనే.. తొలిసారి ఎన్నికలను బహిష్కరించిన టీడీపీ
posted on Apr 3, 2021 @ 11:52AM
ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను తెలుగు దేశం పార్టీ బహిష్కరించడం చర్చగా మారింది. రాజకీయ వర్గాల్లో భిన్న స్పందనలు వస్తున్నాయి. పరిషత్ ఎన్నికలను టీడీపీ బహిష్కరించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు వివరణ ఇచ్చారు. బాధ, ఆవేదనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే అవకాశం లేదన్నారు. నాలుగు వారాల కోడ్ ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశం ఏమైందని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని బొమ్మగా చేసి ఎన్నికలను పరిహాసాస్పదంగా మారుస్తున్న జగన్ ప్రభుత్వ వ్యవహార శైలికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ‘నా నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా ఎన్నికల బహిష్కరణ నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణలో ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలోనూ పోటీ చేశాం. తీవ్రవాదుల ప్రభావం బాగా బలంగా ఉన్న చోట్ల కూడా చేశాం’ అని చంద్ర బాబు చెప్పారు.
రాజకీయ చరిత్రలో టీడీపీ ఎన్నికల బహిష్కరించడం ఇదే తొలిసారి. పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ ఎప్పుడూ ఎన్నికలను బహిష్కరించలేదు. తెలంగాణ ఉద్యమం వంటి సమయాల్లోనూ ఎన్నికల్లో పోటీ చేసింది. మధ్యలో కొన్నిసార్లు కొన్ని ఉప ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. నాటి ప్రధాని పీవీ నరసింహరావు పోటీ చేసిన నంద్యాల లోక్‌సభ స్థానంలో, కాంగ్రెస్ సీనియర్ నేత పీజేఆర్ మరణం తర్వాత జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నిక, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాగ్యా నాయక్‌ను నక్సలైట్లు హత్య చేసిన తర్వాత వచ్చిన ఉప ఎన్నిక, వైసీపీ నేత శోభా నాగిరెడ్డి మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నిక లో ఆ పార్టీ పోటీ చేయలేదు. ఏక మొత్తంగా ఎన్నికలను బహిష్కరించడం ఇదే తొలిసారి.
టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం పొలిట్‌బ్యూరో, రాష్ట్ర స్థాయి నేతల సమావేశం నిర్వహించారు. ఎన్నికల బహిష్కరణపై టీడీపీ నేతల నుంచి భిన్న స్వరాలు వినిపించాయి. ఎన్నికలను బహిష్కరించడమే మేలని కొందరు వాదించగా వారితో మరికొందరు విభేదించారు. అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్యచౌదరి, యనమల రామకృష్ణుడు, కూన రవికుమార్ వంటివారు.. ఎన్ని సమస్యలున్నా ఎన్నికల్లో పోరాడుతూనే ఉండాలని, అప్పుడే కేడర్‌ను నిలబెట్టుకోగలమని అభిప్రాయపడ్డారు. కానీ మెజారిటీ నేతలు బహిష్కరణకే మొగ్గు చూపారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరఫున పోటీలో ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులతో కూడా చంద్రబాబు మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు. మెజారిటీ నేతల అభిప్రాయం ప్రకారం ఎన్నికల బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించారు.