ప్రచారంలో కస్సుబుస్సుమన్న నమిత.. .
posted on Apr 3, 2021 @ 11:41AM
నటి నమిత ప్రచారం చేయడానికి వెళ్ళింది.. అసలు అభ్యర్థే పత్తాలేదు.. తొమ్మిదినరకు ప్రారంభం కావాల్సిన ప్రచారం 10 :15 స్టార్ట్ అయింది.. నటి నమితకు చిర్రెత్తే. దాంతో ప్రచారం గిచారం జాంతానై.. కేల్కతం దుకాణ్ బంద్ అంటూ.. అభ్యర్థులు ప్రచారంలో లేకపోతే నేను చెన్నై చెక్కేస్తా అంటూ ఆగ్రహం ప్రదర్శించారు. ఈ ఘటన రామనాధపురంలో జరిగింది.
బీజేపీ పార్టీ అభ్యర్ధులకు మద్దతుగా ఆ పార్టీ నాయకురాలు నటి నమిత ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. నమిత ప్రచారంతో కార్యకర్తలు మాత్రం కేరింతలు కొడుతూ రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో.. రామనాథపురం బీజేపీ అభ్యర్ధి కుప్పు రాముకు మద్దతుగా నమిత గురువారం రామేశ్వరం మున్సిపాలిటీల్లో నాలుగు ప్రాంతాల్లో ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు.
ఉదయం 9.30 గంటలకు మరుదుపాండియన్ విగ్రహం సమీపం నుంచి ఆమె ప్రచారం ప్రారంభించాల్సి ఉండగా, 10.15 గంటలకు కూడా అభ్యర్ధి కుప్పు రాము రాలేదు. దీంతో, మరుదుపాండియన్ విగ్రహం సమీపంలో ప్రచారం రద్దు చేసుకున్న నమిత, బస్టాండ్, దేవర్ విగ్రహం ప్రాంతంలో ప్రచారానికి వెళ్లారు. అప్పటికీ కూడా అభ్యర్ధి జాడలేకపోవడంతో ఆగ్రహించిన నమిత ప్రచారం రద్దు చేసుకొని హోటల్‌కు వెళ్లిపోయారు. సాయంత్రం ప్రచారానికి రావాలని బీజేపీ కార్యకర్తలు కోరడంతో, ఆగ్రహించిన నమిత శివంగిలా ఊగిపోయారు ‘అభ్యర్ధి లేకుండా ప్రచారం చేయబోనని, ఇలాగైతే చెన్నై వెళ్లిపోతానని మండిపడ్డారు.. అయినా ఆ అభ్యర్థి పట్టించుకుంటేగా?