ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం
posted on Apr 4, 2025 @ 10:23AM
ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. సచివాలయం రెండో బ్లాక్ లోని బ్యాటరీ రూమ్ లో శుక్రవారం (ఏప్రిల్ 4) తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో బ్యాటరీలు పూర్తిగా కాలి బూడదయ్యాయి. ప్రమాద సమయంలో ఎమర్జెన్సీ ఫైర్ అలారం మోగకపోవడంతో మంటల వ్యాప్తిని ఎవరూ గుర్తించలేకపోయారని తెలుస్తోంది. ప్రమాదానికి కారణమేంటన్నది తెలయాల్సి ఉంది.
ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలి వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అగ్ని ప్రమాదం జరిగిన రెండో బ్లాక్ లోనే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టూరిజం శాఖ మంత్రి కందుల రమేష్, ఇంకా మునిసిప్ మంత్రి నారాయణ, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తదితరుల కార్యాలయాలు ఉన్నాయి. ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత ప్రమాద కారణాలపై ఆరా తీశారు. సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశించారు. సచివాలయ భద్రతా సిబ్బంది అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.