బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూత
posted on Apr 4, 2025 @ 10:06AM
ప్రతిష్ఠాత్మ దాదాసాహెబ్ ఫాల్కె పురస్కార గ్రహీత, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాలీవుడ్ అగ్రదర్శకుడు, నటుడు మనోజ్ కుమార్ శుక్రవారం తెల్లవారు జామున కన్ను మూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మనోజ్ కుమార్ ముంబైలోని దీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు.
మనోజ్ కుమార్ సినీ పరిశ్రమలోకి నటుడిగా అడుగుపెట్టారు. 1957లో ఫ్యాషన్ అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన మనోజ్ కుమార్ అసలు పేరు హరికృష్ణ గోస్వామి. ఇక ఆయన 1995లో మైదాన్ ఈ జంగ్ అనే చిత్రంలో నటించారు. అదే ఆయన చివరి సినిమా. నటన కంటే దర్శకత్వానికే ప్రాధాన్యత ఇచ్చిన మనోజ్ కుమార్ పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించారు. ఎక్కువగా దేశ భక్తి ఇతివృత్తంతోనే ఆయన ఎక్ువ సినిమాలు చేశారు. సినీ పరిశ్రమకు మనోజ్ కుమార్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2015లో ఆయకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేసింది. అంతకు ముందే ఆయన 2011 పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన సినీ పరిశ్రమకు సేవలందించారు. అమితాబ్ బచ్చన్ హీరోగా ఆయన తీసిన రోటీ కపడా ఔర్ మకాన్ చిత్రం 1974లో విడుదలై సంచలనం సృష్టించింది.
దిగ్గజ దర్శకుడు మనోజ్ కుమార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రగాభ సంతాపం వ్యక్తం చేశారు. ఇండియన్ సినీమాలో ఆయన ఒక ఐకాన్ అంటూ మోడీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.