క్లాస్ రూమ్‌లో టీచర్ల ఫైటింగ్
posted on Feb 26, 2021 @ 9:42AM
విద్యార్థులకు విద్యతోపాటు క్రమశిక్షణ నేర్పి మంచి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన లెక్చరర్లు విచక్షణ కోల్పోయి తరగతి గదిలోనే ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా అనపర్తి సమీపములోని కొత్తూరులో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంగ్లిషు మీడియం గురుకుల జూనియర్ కాలేజీలో ఎనిమిది సంవత్సరాలుగా వెంకటేశ్వరరావు పార్ట్‌టైమ్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. అయితే కొంతకాలం క్రితం వెంకటేశ్వరరావుతో పాటు అక్కడ పనిచేసే మరి కొంతమంది పార్ట్‌టైమ్ లెక్చరర్లు టెట్ పరీక్షలకు హాజరుకాలేదని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు వెంకటేశ్వరరావుతో పాటు మరో అధ్యాపకుడిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పార్ట్‌టైమ్ లెక్చరర్ వెంకటేశ్వరావు, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. కళాశాలలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి వెంకటేశ్వరరావు ఉన్నతాధికారులకు తెలియజేయడంతో వారు శ్రీనివాసరావును వివరణ కోరారు. ఈ నేపథ్యంలో గురువారం ఇద్దరు తరగతి గదిలోనే విద్యార్థుల ముందే ఘర్షణకు దిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో గాయాలపాలైన వీరిద్దరిని సహచర లెక్చరర్లు, విద్యార్థులు విడదీసి అనపర్తి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి చేర్చారు. కళాశాలలో విద్య నేర్పాల్సిన గురువులు ఇలా తరగతి గదిలో విద్యార్థుల ముందే కొట్టుకోవడం తో ఇక వీరు క్రమశిక్షణ ఏమి నేర్పుతారు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.